Share News

మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు..

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:02 AM

మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్‌ రాజ్‌ కసిరెడ్డికి(ఏ1) సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది.

మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు..

  • రూ.732 కోట్లకు ఆ శిక్ష సరిపోతుందనుకుంటున్నారా?

  • ఆ డబ్బు మీ ఖాతాల్లో కనిపించకపోవచ్చు

  • కుంభకోణంలో మీ పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది

  • మీదే కీలకపాత్ర అని దర్యాప్తు నివేదికలో ఉంది

  • మీ నియంత్రణలోనే నిధులు మళ్లించిన షెల్‌ సంస్థ

  • మీరు ప్రధాన కుట్రదారు.. ఇతరులతో పోల్చలేం

  • మిగిలిన వారికి బెయిల్‌ ఇచ్చామని మీకు ఇవ్వలేం

  • మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

  • రాజ్‌ కసిరెడ్డికి బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరణ

  • తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్‌ రాజ్‌ కసిరెడ్డికి(ఏ1) సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం విముఖత వ్యక్తం చేసింది. మద్యం కుంభకోణం కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌ కసిరెడ్డికి బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దాన్ని సవాలు చేస్తూ కసిరెడ్డి వేసిన పిటిషన్‌ సోమవారం చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ ఎన్‌.వీ.అంజరియాలతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. కసిరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపిస్తూ.. కసిరెడ్డి 10 నెలలుగా జైలులోనే ఉన్నారని, బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. ఇదే కేసులో ఏ6, ఏ34 తదితరులకు ఇప్పటికే బెయిల్‌ లభించిందన్నారు. ఒక వ్యక్తిని నేరం రుజువు కాకుండానే 10 నెలలపాటు జైలులోనే ఉంచడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. ఏ7కు బంధువు అనే ఒక్క కారణంతో బెయిల్‌ నిరాకరించడం సరికాదన్నారు. స్పందించిన ధర్మాసనం..‘వారికి బెయిల్‌ లభించిందని మీకు ఇవ్వలేం. కావాలంటే వారికిచ్చిన బెయిల్‌ రద్దు చేయమని మీరు కోరవచ్చు, కానీ మీ కేసు భిన్నమైనది’ అని స్పష్టం చేసింది.


రూ.732 కోట్లు చిన్న మొత్తమా?.. నాగముత్తు వాదనలపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రూ.732 కోట్లు చిన్న మొత్తమా? అని ప్రశ్నించింది. ‘10 నెలలే కదా జైలులో ఉన్నది. రూ.732 కోట్ల కుంభకోణంలో 10 నెలలు జైలులో ఉంటే సరిపోతుందని మీరు భావిస్తున్నారా?. మద్యం కుంభకోణం జరిగిందని చెబుతున్న సమయంలో మీరు అధికారంలో ఉన్న వ్యక్తి. మీపై వచ్చిన ఆరోపణలకు, మీరు చాలా కాలంపాటు నిర్వహించిన పదవికి ప్రత్యక్ష సంబంధం ఉంది. మీరు సామాన్యమైన వ్యక్తి కాదు. మీరు భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని దర్యాప్తులో తేలింది. ఆ డబ్బు మీ ఖాతాల్లో లేదా తెలిసిన వనరుల్లో కనిపించకపోవచ్చు, కానీ, కుంభకోణంలో మీ పాత్ర స్పష్టంగా ఉంది. ఈ వ్యవహారంలో మీరు ప్రధాన కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మిమ్మల్ని ఇతర నిందితులతో పోల్చలేం. నిధులు మళ్లించినట్లుగా చెబుతున్న షెల్‌ కంపెనీ మీ ప్రత్యక్ష నియంత్రణలోనే ఉంది. కాబట్టి మీరు ఇతర నిందితుల కంటే భిన్నమైన స్థితిలో ఉన్నారు. మద్యం పాలసీని ప్రభావితం చేయడంలోనూ, కొన్ని బ్రాండ్లకు లబ్ధి చేకూర్చడంలోనూ మీ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది’ అని పేర్కొంది. ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా, సిద్ధార్థ్‌ అగర్వాల్‌ వాదిస్తూ.. నిందితుడు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అని, బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని చెప్పారు. దీంతో.. వేరే నిందితులతో సమానంగా రాజ్‌ కసిరెడ్డిని చూడలేమని, కావున బెయిల్‌ పిటిషన్‌ డిస్మిస్‌ చేస్తామని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టులో తమ వాదనలు సరిగా వినలేదని, సుప్రీంకోర్టులో తమ వాదనలు పూర్తిగా వినాలని నాగముత్తు అభ్యర్థించగా.. ఆ వాదనలను ఇప్పుడే వినిపించాలని సీజేఐ అన్నారు. శుక్రవారానికి వాయిదా వేయాలని, ఆ రోజు సమగ్రంగా వాదనలు వినిపిస్తామని నాగముత్తు తెలిపారు. దీంతో అన్ని వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే హైకోర్టు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసి ఉండవచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమకు సమగ్ర వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించాలని నాగముత్తు మరోసారి అభ్యర్థించగా, పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

Updated Date - Feb 10 , 2026 | 07:35 AM