Share News

ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులివ్వలేం

ABN , Publish Date - Jul 14 , 2026 | 03:56 AM

పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. ఈ పథకంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకెళ్లకుండా..

ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులివ్వలేం

  • పోలవరం-బనకచర్లపై తెలంగాణకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ

  • పిటిషన్‌లో లోపాలు సవరించుకోండి

  • ప్రతివాదులందరికీ నోటీసులు అందాల్సిందే

  • తర్వాతే వ్యాజ్యం విచారణపై ఆలోచిస్తాం

  • తెలంగాణ ప్రభుత్వానికి తేల్చిచెప్పిన బెంచ్‌

  • తదుపరి విచారణ 28కి వాయిదా

న్యూఢిల్లీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. ఈ పథకంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకెళ్లకుండా అడ్డుకునేలా మధ్యంతర ఉత్తర్వులివ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. లోపభూయిష్టంగా ఉన్న తెలంగాణ పిటిషన్‌పై ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చిచెప్పింది. ఆ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన ఒరిజినల్‌ సూట్‌ విచారణార్హత సాధించాలంటే.. ముందుగా అందులోని లోపాలను పూర్తిగా నివృత్తి చేసుకోవాలని హితబోధ చేసింది. పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టు విషయంలో ఏపీనినిలువరించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 24న సుప్రీంకోర్టులో ఒరిజినల్‌ సూట్‌ (ఓఎస్‌ నంబర్‌ 1/2026) దాఖలు చేసింది. తమ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏపీ ఈ ప్రాజెక్టు చేపడుతోందని.. నిబంధనలు, విభజన చట్టానికి వ్యతిరేకంగా చేపట్టే ఈ ప్రాజెక్టుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసా, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ), కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సహా మరికొందరిని ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిటిషన్‌ సోమవారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మనుసింఘ్వీ, గోపాల శంకరనారాయణన్‌, తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు.


రిజిస్ర్టీ అభ్యంతరాలను సవరించండి

విచారణ ప్రారంభం కాగానే.. సుప్రీంకోర్టు రిజిస్ర్టీ సమర్పించిన ఆఫీస్‌ రిపోర్ట్‌ను ధర్మాసనం ప్రస్తావించింది. ఈ కేసులో మొత్తం 15 మంది ప్రతివాదులు ఉండగా.. వారందరికీ నోటీసులు అందజేసే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని తెలిపింది. అలాగే పిటిషన్‌లో పలు లోపాలు ఉన్నాయని న్యాయస్థానం గుర్తించింది. ‘పిటిషన్‌లో కొన్ని ప్రాథమిక లోపాలు ఉన్నాయి. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ కానిదే ఈ రోజు ఈ కేసును మేం విచారించలేం. పిటిషనర్‌ ముందుగా రిజిస్ర్టీ లేవనెత్తిన అభ్యంతరాలను సవరించాలి. సుప్రీంకోర్టు నిబంధనలను అతిక్రమించి, ఆఫీస్‌ రిపోర్టును పక్కనపెట్టి విచారణ చేపట్టడం సాధ్యం కాదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే సాంకేతిక కారణాలతో పిటిషన్‌ను తిరిగి దాఖలు చేయడంలో (రీ ఫైలింగ్‌) రెండ్రోజులు మాత్రమే ఆలస్యమైందని తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది సింఘ్వీ తెలిపారు. ఆఫీస్‌ రిపోర్టులోని అభ్యంతరాలేమిటో మరోసారి సరిచూసుకోవాలని ధర్మాసనం సూచించింది. ఆ తర్వాతే దీనిపై ముందుకు వెళ్తామని తేల్చిచెప్పింది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు కోరుతున్నామని, అందువల్ల మిగతా ప్రతివాదులకు నోటీసులు అందని కారణంగా విచారణను నిలిపివేయాల్సిన అవసరం లేదని తెలంగాణ తరఫున హాజరైన మరో సీనియర్‌ న్యాయవాది గోపాల శంకరనారాయణన్‌ పేర్కొన్నారు. ఆయనతో ధర్మాసనం ఏకీభవించలేదు. నిబంధనల ప్రకారం ముందుగా అభ్యంతరాలన్నింటినీ నివృత్తి చేయాలని, ఆ షరతులన్నీ పూర్తిగా నెరవేరిన తర్వాతే నిబంధనలకు లోబడి కేసును మళ్లీ విచారిస్తామని పునరుద్ఘాటించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తున్నట్లు తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

Updated Date - Jul 14 , 2026 | 03:56 AM