Share News

ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు కావాలా ఏంటి?

ABN , Publish Date - Jul 24 , 2026 | 05:37 AM

విచారణ పేరుతో వేరే దేశాల్లో మాదిరిగా, ఫైవ్‌ స్టార్‌ సౌకర్యాలు కావాలా ఏంటి? అని సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రధాన నిందితుడు, సీఐ నాగరాజును సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు కావాలా ఏంటి?

  • సీఐ నాగరాజుకు సుప్రీంకోర్టు సూటి ప్రశ్న

న్యూఢిల్లీ, జూలై 23(ఆంధ్రజ్యోతి): విచారణ పేరుతో వేరే దేశాల్లో మాదిరిగా, ఫైవ్‌ స్టార్‌ సౌకర్యాలు కావాలా ఏంటి? అని సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రధాన నిందితుడు, సీఐ నాగరాజును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పోలీసు విచారణ చట్టబద్థమైన పద్ధతుల్లో, కోర్టు మార్గదర్శకాలకు లోబడి మాత్రమే జరుగుతుందని స్పష్టం చేసింది. సీఐ నాగరాజు కస్టడీ విచారణ నిబంధనలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. నాగరాజు కస్టడీ విచారణను రాజమండ్రికి మార్చడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. గురువారం ఆ పిటిషన్‌ జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ‘‘రాజమండ్రి నుంచి విజయవాడకు ప్రయాణానికే అటూఇటూ ఆరు గంటల సమయం పడుతుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణకు సమయముంది. జైలు నుంచి బయటకు తీసేసరికే సమయం ముగిసిపోతుంది. ఇక దర్యాప్తు ఎప్పుడు చేయాలి?’’ అని ప్రశ్నించారు. 24 గంటలూ న్యాయవాది పక్కనే ఉండాలని, రికార్డింగ్‌ చేయాలనడం వల్ల విచారణ సాగడం లేదన్నారు. సీఐ నాగరాజు తరఫున న్యాయవాది ఎల్‌.నరసింహారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘సదరు పోలీస్‌ అధికారి విజయవాడ జైలులోని పలువురి అరెస్టుకు కారణమైనందున, అక్కడ ఉంచితే ప్రాణహాని ఉంటుంది. అందువల్లే కస్టడీ విచారణను రాజమండ్రికి మార్చారు.’’ అని తెలిపారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ...‘‘ఏంటి.. విచారణ పేరుతో వేరే దేశాల్లో లాగా ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు, ఏసీ రూమ్‌లు, ప్రత్యేక సదుపాయాలు కావాలా ఏంటి?’’ అని వ్యాఖ్యానించింది. సమస్య కేవలం జైలు మార్పిడి గురించి కాదని, రిమాండ్‌ విచారణ పద్ధతి గురించి అని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం 90 రోజుల విచారణ గడువును ఎట్టిపరిస్థితుల్లోనూ పొడిగించేది లేదని తెలిపింది. బెంచ్‌ తన తీర్పును రిజర్వ్‌ చేసింది.

Updated Date - Jul 24 , 2026 | 05:39 AM