Supreme Court: ఏసీబీ కేసుల కొట్టివేత చెల్లదు!
ABN , Publish Date - Jan 09 , 2026 | 03:50 AM
అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను సాంకేతిక కారణాలతో కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
ఏపీ హైకోర్టు తీర్పు న్యాయానికి విఘాతం
సాంకేతిక కారణాలతో ఎఫ్‌ఐఆర్‌ల రద్దు.. న్యాయాన్ని అపహస్యం చేయడమే: సుప్రీంకోర్టు
హైకోర్టు తీర్పు రద్దు.. తిరిగి దర్యాప్తు కొనసాగింపు
6 నెలల్లో దర్యాప్తులు పూర్తి చేయాలని ఏసీబీకి నిర్దేశం
న్యూఢిల్లీ, జనవరి 8(ఆంధ్రజ్యోతి): అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను సాంకేతిక కారణాలతో కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. హైకోర్టు తీర్పు న్యాయానికి విఘాతం కలిగించే లా ఉందని ఆక్షేపించింది. ఆ తీర్పు న్యాయాన్ని అపహస్యం చేయడమేనంటూ తీవ్రవ్యాఖ్యలు చేసింది. చట్టాన్ని వక్రీకరించడంలో హైకోర్టు తప్పుదోవ పట్టిందని వ్యాఖ్యానించింది. అతి సాంకేతిక కారణాలతో ఏసీబీ కేసులను కొట్టివేయడం చెల్లదని తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పును రద్దు చేసింది. హైకోర్టు తీర్పు వల్ల నిలిచిపోయిన కేసుల దర్యాప్తును తిరిగి కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈమేరకు జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ సతీశ్ చంద్రశర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం కీలకతీర్పును వెలువరించింది.
నాడు 15 మందిపై అవినీతి కేసుల కొట్టివేత
2016-2020 మధ్య కాలంలో అనేకమంది అధికారులు, ఉద్యోగులపై ఏపీ ఏసీబీ-సీఐయూ(సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్, విజయవాడ) అవినీతి కేసులను నమోదు చేసింది. అయితే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ) 1973 సెక్షన్ 2(ఎస్) ప్రకారం విజయవాడలోని ఏసీబీ కార్యాలయాన్ని పోలీ్‌సస్టేషన్‌గా ప్రకటిస్తూ రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వలేదని, అందువల్ల ఆ ఎఫ్‌ఐఆర్‌లకు చట్టబద్ధత లేదని 15 మంది నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఏసీబీ విభాగంలోని జాయింట్ డైరెక్టర్ల కార్యాలయాలను పోలీసుస్టేషన్లుగా గుర్తిస్తూ 2003లోనే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందని, పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101, 102 ప్రకారం రాష్ట్ర విభజన అనంతరం ఆ చట్టాలు అమల్లో ఉంటాయని నాడు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. అయితే, విజయవాడలోని ఏసీబీ సీఐయూ యూనిట్‌ను పోలీసుస్టేషన్‌గా నోటిఫై చేస్తూ 2022 సెప్టెంబరు 14న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో 2016 నుంచి 2020 మధ్య నమోదు చేసిన 15 కేసులను రద్దు చేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది.
ఆ ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ గతేడాది ఏసీబీ జాయింట్ డైరెక్టర్(రాయలసీమ), రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో సెక్షన్లు 100, 101, 102 ప్రకారం, ఉమ్మడి రాష్ట్రంలో అమలులో ఉన్న చట్టాలు, జీవోలు కొత్త రాష్ట్రంలోనూ కొనసాగుతాయని స్పష్టం చేసింది. నిలిచిపోయిన కేసుల విచారణను ఏసీబీ అధికారులు వెంటనే ప్రారంభించవచ్చని, ఈ తీర్పు కాపీ అందిన తేదీ నుంచి 6 నెలల లోపు దర్యాప్తును పూర్తి చేసి నివేదికలు అందించాలని ఆదేశించింది.