ఇసుక అక్రమ తవ్వకాల కేసు విచారణ వాయిదా
ABN , Publish Date - Jan 24 , 2026 | 06:55 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ మైనింగ్‌కు పాల్పడినందుకు రూ. 18 కోట్లు చెల్లించాలంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ...
జరిమానా చెల్లింపునకు సుప్రీం కోర్టు రెండు ఆప్షన్లు
న్యూఢిల్లీ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ మైనింగ్‌కు పాల్పడినందుకు రూ. 18 కోట్లు చెల్లించాలంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జైప్రకాశ్ పవర్ వెంచర్స్ దాఖలు చేసిన కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మసీ్‌హతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. విచారణ సందర్భంగా ఈ కేసులో ఇప్పటికే రూ. 8 కోట్లు డిపాజిట్ చేశారని, మిగతా డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉందని జస్టిస్ కరోల్ ప్రస్తావించారు. రెండు ఆప్షన్లను సూచించారు. ఈ కేసును తిరిగి ఎన్జీటీకి పంపించి మిగిలిన మొత్తాన్ని ఎవరు చెల్లించాలనే అనే విషయాన్ని అక్కడ తేల్చడం లేదా సుప్రీంకోర్టే ఈ అంశంపై విచారణ జరిపి పర్యవేక్షణ కొనసాగించడంపై అభిప్రాయాన్ని చెప్పాలన్నారు. జైప్రకాశ్ వెంచర్స్ తరఫు న్యాయవాదులు తిరిగి ఎన్జీటీకి పంపించాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టే విచారించాలని కోరారు. జైప్రకాశ్ వెంచర్స్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అందుబాటులో లేకపోవడం, కోర్టు సూచించిన ఆప్షన్లపై నిర్ణయం తీసుకోవడానికి సమయం కావాలని కోరడంతో తదుపరి విచారణను ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది.