Share News

ఆకివీడు వివాదంపై ‘సుప్రీం’ స్టేటస్‌ కో

ABN , Publish Date - May 19 , 2026 | 05:49 AM

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రభుత్వ స్థలంలో మతపరమైన కట్టడాల నిర్మాణాలు, కూల్చివేతల వివాదంపై సుప్రీం కోర్టు స్టేటస్‌ కో విధించింది.

ఆకివీడు వివాదంపై ‘సుప్రీం’ స్టేటస్‌ కో

  • ఏపీ ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు

  • నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం

న్యూఢిల్లీ, మే 18 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రభుత్వ స్థలంలో మతపరమైన కట్టడాల నిర్మాణాలు, కూల్చివేతల వివాదంపై సుప్రీం కోర్టు స్టేటస్‌ కో విధించింది. తదుపరి విచారణ వరకు వివాదాస్పద ప్రాంతంలో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఆకివీడు కట్టడాల వివాదంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఈ నెల 6వ తేదీన జయంతి ఉన్మత్త సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ సోమవారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ఆకివీడులో దళిత క్రేౖస్తవులు ఏళ్ల తరబడి పూజలు చేసుకుంటున్న గొంతెనమ్మ ఆలయాన్ని స్థానికుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఏకపక్షంగా కూల్చివేశారని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో మతపరమైన నిర్మాణాలు, కూల్చివేతలకు సంబంధించి సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ప్రతివాదులైన ఏపీ ప్రభుత్వంతోపాటు మరో ఐదుగురికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. అప్పటి వరకూ ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్టకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 13కి వాయిదా వేసింది.

Updated Date - May 19 , 2026 | 05:49 AM