Share News

పిల్లల సంరక్షణ కోసం ‘హెబియస్‌ కార్పస్‌’ కుదరదు

ABN , Publish Date - Jul 11 , 2026 | 05:30 AM

మైనర్ల సంరక్షణపై వివాదాల్లో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టవిరుద్ధంగా ఎవరినైనా నిర్బంధించినప్పుడు మాత్రమే ఈ పిటిషన్‌ దాఖలు చేయాలని..

పిల్లల సంరక్షణ కోసం ‘హెబియస్‌ కార్పస్‌’ కుదరదు

  • అమ్మమ్మ వద్ద ఉండటం చట్టవిరుద్ధమైన నిర్బంధం కాదు: సుప్రీం

న్యూఢిల్లీ, జూలై 10 (ఆంధ్రజ్యోతి): మైనర్ల సంరక్షణపై వివాదాల్లో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టవిరుద్ధంగా ఎవరినైనా నిర్బంధించినప్పుడు మాత్రమే ఈ పిటిషన్‌ దాఖలు చేయాలని, పిల్లల సంరక్షణ కోరే విషయంలో గార్డియన్స్‌ అండ్‌ వార్డ్స్‌ కోర్టును ఆశ్రయించడమే చట్టపరంగా సరైన మార్గమని తేల్చిచెప్పింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీవీఎస్ఎల్‌ఎన్‌ ఆచార్యులు, ఆయన భార్య మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. వీరికి ఐదేళ్లు, రెండేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లల తల్లిపై ఎన్డీపీఎస్‌ యాక్టు కింద కేసు నమోదవడం, ఆమె మానసిక ఆసుపత్రిలో చేరడం వంటి పరిణామాల నేపథ్యంలో పిల్లలు ప్రస్తుతం అమ్మమ్మ సంరక్షణలో ఉన్నారు. అయితే వారిని చట్టవిరుద్ధంగా నిర్బంధించారని ఆరోపిస్తూ ఆచార్యులు హెబియస్‌ కార్పస్‌ వేశారు. అది చట్టవిరుద్ధమైన నిర్బంధం కిందకు రాదని, పిల్లల సంరక్షణ కోసం సంబంధిత గార్డియన్స్‌ అండ్‌ వార్డ్స్‌ కోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. తీర్పును ఆచార్యులు ఈనెల 2న సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్‌ శుక్రవారం జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ శ్రీ చంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిల్లలు అమ్మమ్మ వద్ద ఉండటం ఏమాత్రం చట్టవిరుద్ధమైన నిర్బంధం కిందకు రాదని ధర్మాసనం స్పష్టం చేసింది. తండ్రి సంరక్షణలో పిల్లలు ఉన్నప్పుడు వారిని ఎవరైనా చట్టవిరుద్ధంగా బలవంతంగా తీసుకెళ్లి ఉంటే హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయవచ్చని పేర్కొంది. ఇలాంటి పిటిషన్లలో జోక్యం చేసుకోలేమని, పిల్లల సంక్షేమం, భద్రతను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సింది గార్డియన్స్‌ అండ్‌ వార్డ్స్‌ కోర్టు మాత్రమేనని తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి తగిన కారణాలు లేవంటూ, ఆర్టికల్‌ 136 కింద దాఖలైన ఎస్‌ఎల్‌పీని కొట్టివేసింది.

Updated Date - Jul 11 , 2026 | 05:30 AM