Share News

ఎన్నికల్లో పోటీ.. బెయిల్‌కు ప్రామాణికం కాదు

ABN , Publish Date - Aug 20 , 2026 | 03:34 AM

ఎన్నికల్లో పోటీ చేయడమే ముందస్తు బెయిల్‌కు ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘‘ఎన్నికల్లో పోటీ చేసే స్వేచ్ఛ ప్రతి పౌరుడికీ ఉంది.

ఎన్నికల్లో పోటీ.. బెయిల్‌కు ప్రామాణికం కాదు

  • మద్యం సిండికేట్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు.. తెర వెనుక ఉండి నడిపినట్టు ప్రాథమిక ఆధారాలు

  • కల్తీ మద్యం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఇద్దరి ముందస్తు బెయిల్‌ పిటిషన్ల కొట్టివేత

న్యూఢిల్లీ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో పోటీ చేయడమే ముందస్తు బెయిల్‌కు ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘‘ఎన్నికల్లో పోటీ చేసే స్వేచ్ఛ ప్రతి పౌరుడికీ ఉంది. అంతమాత్రాన ప్రత్యేక వెసులుబాటు కావాలంటే కుదరదు’’ అని తెలిపింది. కల్తీ మద్యం కేసులో నిందితులు మంత్రి గిరిధర్‌ రెడ్డి, జయచంద్రారెడ్డిలకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. మద్యం సిండికేట్‌తో నిందితులకు సంబంధాలున్నట్లు ఆరోపణలు ఉండటంతోపాటు, తెరవెనుక ఉండి వ్యవహారాన్ని నడిపించినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అన్నమయ్య జిల్లా ములకలచెరువు కేంద్రంగా జరిగిన నకిలీ మద్యం తయారీ గుట్టును గతేడాది అక్టోబరులో ఎక్సైజ్‌ పోలీసులు బయటపెట్టారు. భారీగా నకిలీమద్యం, తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి 35 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు 33మందిని అరెస్టు చేశారు. ఇందులో మంత్రి గిరిధర్‌ రెడ్డి(ఏ18)తోపాటు తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డిని(ఏ17) నిందితులుగా చేర్చారు. అయితే, కేసులో తమ పేర్లను చట్ట విరుద్ధంగా చేర్చారని ఆరోపిస్తూ, ముందస్తు బెయిల్‌ కోసం వారు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. దీంతో మే 19న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ బుధవారం జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ ప్రసన్న బి. వరాలేతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.


రాజకీయ దురుద్దేశంతో కేసులు

గిరిధర్‌ రెడ్డిని రాజకీయ దురుద్దేశంతో కేసులో ఇరికించారని ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ‘‘అక్రమ మద్యం తయారీ వ్యవహారంతో గిరిధర్‌ రెడ్డికి ఎలాంటి ప్రత్యక్ష లేక పరోక్ష సంబంధం లేదు. రాజకీయ, వ్యక్తిగత కారణాలతోనే ఆయన పేరు కేసులో చేర్చారు. ఎఫ్‌ఐఆర్‌లో మొదట చేర్చలేదు. సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించిన వెంటనే విదేశాల నుంచి వచ్చి దర్యాప్తు సంస్థ ఎదుట హాజరయ్యారు. ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. దర్యాప్తు సంస్థలు చెబుతున్న వాహనంతో గిరిధర్‌ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సహా ఇతరులకు కింది కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది’’ అని వివరించారు. ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇదొక కల్తీ మద్యం ముఠాకు సంబంధించిన తీవ్రమైన కేసని తెలిపారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. రాజకీయ నాయకుడు అనే కారణంతో కేసు నుంచి తప్పించుకోలేరన్నారు.

తెర వెనుక పాత్రపై ఆధారాలు: బెంచ్‌

కల్తీ మద్యం వ్యాపారంతో నిందితులకు సంబంధాలున్నట్లు ఆరోపణలు ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తెర వెనుక ఉండి కార్యకలాపాలు నడిపించినట్లు దర్యాప్తు సంస్థ వద్ద ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ అనేది ప్రామాణికం కాబోదంటూ గిరిధర్‌ రెడ్డి, జయచంద్రారెడ్డిల ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది. ట్రయల్‌ కోర్టులో రెగ్యులర్‌ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలని, పిటిషన్‌ దాఖలు చేసిన రోజే పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేయగా, ధర్మాసనం అంగీకరించింది.

Updated Date - Aug 20 , 2026 | 03:35 AM