Judicial Academy: ఏఐతో న్యాయ వ్యవస్థలో భారీ మార్పులు
ABN , Publish Date - Jan 03 , 2026 | 06:39 AM
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో న్యాయవ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులు రాబోతున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ అన్నారు.
ఏఐ మన ఆలోచనాశక్తిని ప్రభావితం చేసే స్థాయికి చేరుతుంది
స్వీయ విశ్లేషణ, సృజనాత్మకత కోల్పోకుండా జాగ్రత్త వహించాలి
న్యాయవాదులతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ
ఏపీ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జస్టిస్ నరసింహకు సన్మానం
అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో న్యాయవ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులు రాబోతున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ అన్నారు. ఏఐ మన ఆలోచనా శక్తిని ప్రభావితం చేసేస్థాయికి చేరుకుంటుందని చెప్పారు. ఈ క్రమంలో స్వీయవిశ్లేషణ శక్తిని కోల్పోకుండా జాగ్రత్త వహించాలని న్యాయవాదులకు సూచించారు. విజయవాడకు వచ్చిన జస్టిస్ పీఎస్ నరసింహ శుక్రవారం ఏపీ హైకోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి శ్రీవారి ప్రతిమను అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ పీఎస్ నరసింహ మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యాయవాదులు కూడా తమ నైపుణ్యాలను మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ వినియోగంపై న్యాయవాదులు, న్యాయమూర్తులకు శిక్షణ అవసరమని సూచించారు. న్యాయమూర్తుల కోసం జ్యుడీషియల్ అకాడమీ ఉన్నట్లే.. న్యాయవాదులకు కూడా శాశ్వత లీగల్ అకాడమీ ఏర్పాటుచేసే విషయంపై దృష్టి సారించాలని ఏపీ బార్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం, అడ్వొకేట్ జనరల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్‌కు సూచించారు. ఏపీ లీగల్ అకాడమీ ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో మౌలికవసతులు మెరుగుపడుతున్నాయని, రెండు మూడేళ్లలో హైకోర్టు భవన నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తర్వాత ఏపీ హైకోర్టుకు ఆలస్యంగా వచ్చినప్పటికీ... తన మనసంతా ఇక్కడే ఉందని అన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ... జస్టిస్ నరసింహ భవిష్యత్తులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతులు చేపట్టబోతున్నారని, ఇది ఈ ప్రాంతవాసులకు గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, సీనియర్ న్యాయవాదులు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, ఉపాధ్యక్షుడు కేవీ రఘువీర్, ప్రధాన కార్యదర్శి సి.సుబోధ్ కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. అంతకుముందు జస్టిస్ నరసింహ హైకోర్టు సీనియర్ న్యాయవాదుల లాంజ్‌కు వెళ్లి వారితో కొద్దిసేపు ముచ్చటించారు. హైకోర్టు గ్రంథాలయాన్ని, హైకోర్టు నూతన భవన నిర్మాణ స్థలాన్ని కూడా పరిశీలించారు. శుక్రవారం రాత్రి జస్టిస్ నరసింహ గౌరవార్థం హైకోర్టు న్యాయమూర్తులందరూ విందు ఏర్పాటు చేశారు.
జస్టిస్ నరసింహను కలిసిన మేదేపల్లి గ్రామస్తులు..
ప్రకాశం జిల్లా, అద్దంకి మండలం, మేదేపల్లి గ్రామస్తులు హైకోర్టుకు వచ్చి జస్టిస్ నరసింహను మర్యాదపూర్వకంగా కలిశారు. జస్టిస్ నరసింహకు ఆయన తండ్రి దివంగత జస్టిస్ కోదండరామయ్య చిత్రపటాన్ని అందజేశారు. వారిని ఆప్యాయంగా పలకరించిన న్యాయమూర్తి... గ్రామపరిస్థితి గురించి తెలుసుకున్నారు. త్వరలో మేదేపల్లికి వస్తానని చెప్పారు. జస్టిస్ నరసింహం పూర్వీకులు మేదేపల్లి గ్రామానికి చెందినవారు కావడం గమనార్హం.