Share News

రెచ్చగొట్టే వ్యాఖ్యలు నేర పరిధిలోకి

ABN , Publish Date - Mar 01 , 2026 | 06:00 AM

రాజ్యాంగం ప్రసాదించిన వాక్‌ స్వాతంత్ర్యా న్ని వినియోగించుకొనే క్రమంలో ఇతరుల హక్కులు, గౌరవానికి భంగం కలిగించకుం డా పౌరులు బాధ్యతతో మెలగాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జె.కె. మహేశ్వరి సూచించారు.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు నేర పరిధిలోకి

  • వాక్‌ స్వాతంత్ర్యానికి మనస్సాక్షి తోడవ్వాలి

  • సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మహేశ్వరి

అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం ప్రసాదించిన వాక్‌ స్వాతంత్ర్యా న్ని వినియోగించుకొనే క్రమంలో ఇతరుల హక్కులు, గౌరవానికి భంగం కలిగించకుం డా పౌరులు బాధ్యతతో మెలగాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జె.కె. మహేశ్వరి సూచించారు. సోషల్‌ మీడియా యుగంలో వాక్‌ స్వాతంత్ర్యానికి మనఃసాక్షి తోడవ్వాలన్నారు. చర్చ, విమర్శ హక్కులేనని, అయితే హింసను ప్రేరేపించే, విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చట్టపరంగా నేర పరిధిలోకి వస్తాయని తెలిపారు. ‘సోషల్‌ మీడియా దుర్వినియోగం- భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, నియంత్రణ మధ్య సమతుల్యతను పాటించాల్సిన ఆవశ్యకత’పై సీఆర్‌ మీడియా అకాడమీ, స్వేచ్ఛ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా విజయవాడలో శనివారం నిర్వహించిన సెమినార్‌ కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్‌ మహేశ్వరి మాట్లాడుతూ, సోషల్‌ మీడియా వినియోగం పెరిగిన తరువాత వాక్‌ స్వాతంత్య్రం, నియంత్రణ మధ్య సమతుల్యతను కాపాడటం పెద్ద సవాలుగా మారిందన్నారు. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి వ్యక్తి ఒక ప్రచురణకర్తగా, ప్రసారకర్తగా, గ్లోబల్‌ వ్యాఖ్యాతగా మారారని పేర్కొన్నారు. ఒక చిన్న పోస్టు నిమిషాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోందని... అపో హ, అసత్యం, ద్వేషం క్షణాల్లో వ్యాపిస్తున్నాయని తెలిపారు. రాజ్యాంగంలోని అధికరణ 19(1) ప్రతి పౌరుడికీ వాక్‌ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ హక్కును ప్రసాదించిందని, అయితే అధికరణ 19(2) ప్రకారం దేశ సార్వభౌమాధికారం, శాంతిభద్రతలు, నైతికతను దృష్టిలో పెట్టుకొని పరిమితులు కూడా ఉన్నాయని వివరించారు. స్వేచ్ఛ ముసుగులో చేసే నేరపూరిత వ్యాఖ్యలు, చట్టవిరుద్ధమైన ఉపన్యాసాలను ప్రత్యేకంగా చూడాలని, ఇలాంటివారిని రక్షించేందుకు చట్టాలు రూపొందించలేదని తెలిపారు. ‘‘వార్తా పత్రికలు, టీవీల్లో ప్రచురించే, ప్రసారం చేసే కథనాలను నియంత్రించేందుకు ఎడిటర్లు ఉన్నారు. కానీ సామాజిక మాధ్యమాల్లో సమాచారాన్ని ఎక్కువమందికి చేరవేసే అల్గారిథమ్‌ ఆగ్రహం, భయం, పక్షపాతం వంటి భావోద్వేగాలను ప్రోత్సహిస్తుంది.


వాస్తవాలను గుర్తించేందుకు ప్రయత్నించదు. హానికరమైన పోస్టు వైరల్‌ అయినప్పుడు దాన్ని పోస్టు చేసిన వ్యక్తితోపాటు ఎక్కువమందికి చేరవేసిన మాధ్యమాలను కూడా జవాబుదారులను చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నాపై కూడా అనుచిత పోస్టులు పెట్టారు. వాటిని తొలగించేందుకు రిజిస్ట్రార్‌ జనరల్‌తో పాటు టెలికమ్యునికేషన్స్‌ శాఖ కృషి చేయాల్సి వచ్చింది’’ అని జస్టిస్‌ మహేశ్వరి తెలిపారు. మీడియా అకాడమీ ఛైర్మన్‌ ఆలపాటి సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ వ్యక్తిగత స్థాయిలో ట్రోలింగ్‌, మహిళలపై వేధింపులు మరింత ఎక్కువ అవుతున్నాయన్నారు. ఏఐ రాకతో ఈ జాడ్యం మరింత పెరిగిందని, రాజకీయ పార్టీలు సైతం విద్వేష ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈగల్‌, సైబర్‌ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ డిజిటల్‌ యుగంలో ప్రజల భావ వ్యక్తీకరణకు విస్తృత వేదికగా మారిన సోషల్‌ మీడియా దుర్వినియోగం అవుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ మాట్లాడుతూ... మహిళల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన ’సైబర్‌ మిత్ర’ శక్తిమంతమైన కవచంలా పని చేస్తోందని, గతేడాది తీసుకున్న కఠిన చర్యల వల్ల సోషల్‌ మీడియా వేధింపులు 17 శాతం తగ్గినట్లు శైలజ వెల్లడించారు.

Updated Date - Mar 01 , 2026 | 06:02 AM