మధ్యవర్తిత్వ కేంద్రంతో ఎంఎస్ఎంఈ రంగానికి మేలు
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:48 AM
మధ్య, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగానికి మధ్యవర్తిత్వ(ఆర్బిట్రేషన్) కేంద్రం ఎంతో మేలు చేస్తుందని, సమస్యలను త్వరగా పరిష్కరించుకునే వీలుంటుందని...
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోటేశ్వరసింగ్
విశాఖలో ఏసీఐఏఎం కేంద్రం ప్రారంభం
సాగర్‌నగర్ (విశాఖపట్నం), ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): మధ్య, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగానికి మధ్యవర్తిత్వ(ఆర్బిట్రేషన్) కేంద్రం ఎంతో మేలు చేస్తుందని, సమస్యలను త్వరగా పరిష్కరించుకునే వీలుంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోటేశ్వరసింగ్ అన్నారు. విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మకమైన ఏషియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ (ఏసీఐఏఎం) కేంద్రాన్ని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివా్‌సతో కలిసి ఆయన ఆదివారం రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ కోటేశ్వరసింగ్ మాట్లాడుతూ... చిన్నపాటి విభేదాలతో వ్యాపారాలు దెబ్బ తినకూడదని, ఇరువర్గాలకు నష్టం కలగకుండా స్నేహ పూర్వక వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవడమే మధ్యవర్తిత్వం ముఖ్య ఉద్దేశమని వివరించారు. డిజిటల్ విధానంలో కేసులను సులువుగా ఫైల్ చేసి, త్వరగా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... దేశంలో మూడో ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని విశాఖలో ప్రారంభించడం గర్వకారణమని, త్వరలోనే విజయవాడలో కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ అంకితాపాండే, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఏపీ ఎంఎ్‌సఎంఈ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ సీఈవో ఆచార్య సూర్యరాజు, సలహాదారు రామరాజు, తదితరులు పాల్గొన్నారు.