ప్రయాణానికే 6 గంటలైతే..దర్యాప్తు ఎలా?
ABN , Publish Date - Jul 16 , 2026 | 04:34 AM
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కస్టడీ విచారణకు సంబంధించిన నిబంధనలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కస్టడీ విచారణ పరమార్థమే దెబ్బతింటుంది
సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వ వాదనలు
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీ విచారణపై హైకోర్టు రూల్స్‌కు అభ్యంతరం
న్యూఢిల్లీ, జూలై 15(ఆంధ్రజ్యోతి): విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కస్టడీ విచారణకు సంబంధించిన నిబంధనలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై బుధవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ‘‘హైకోర్టు మార్గదర్శకాల వల్ల పోలీసు కస్టడీ ఉద్దేశమే నిరర్థకం అయ్యే అవకాశం ఉంది. విజయవాడ నుంచి రాజమండ్రికి సుమారు 160 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే విచారణ సమయం. కేవలం ప్రయాణానికే దాదాపు ఆరు గంటలు వృథా అవుతుంది. ఇక దర్యాప్తు ఎప్పుడు సాధ్యమవుతుంది?’’ అని ఆయన ప్రశ్నించారు. సీఐ నాగరాజు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘విజయవాడ కమిషనరేట్ పరిధిలో విచారణ జరిగితే నిందితుడికి ప్రాణ ముప్పు ఉంటుంది. రక్షణ చర్యల్లో భాగంగానే న్యాయవాది సమక్షంలోనే విచారించాలని కోరాం. పోలీసు విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. చట్టప్రకారం 90 రోజుల గడువు నడుస్తోంది. కింది కోర్టులో దాదాపు 140 పేజీల రికార్డులను సమర్పిస్తే, ప్రభుత్వం మాత్రం కేవలం రెండు అంశాలనే ఎంపిక చేసుకుని ప్రస్తావిస్తోంది. దీనిపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేేసందుకు సమయం కావాలి’’ అని కోరారు. ఇరుపక్షాల వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలుకు వారం రోజుల గడువు మంజూరు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.