‘తిరుమల కల్తీ నెయ్యి’పై మాట్లాడవద్దని ఆదేశించలేం!
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:18 AM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన అంశంపై రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని మాట్లాడవద్దంటూ ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
‘లడ్డూ’పై తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు
చంద్రబాబు, పవన్, పెమ్మసాని తదితరులపై వ్యాజ్యం కొట్టివేత
న్యూఢిల్లీ, మార్చి 13(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన అంశంపై రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని మాట్లాడవద్దంటూ ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. లడ్డూ ప్రసాదం కల్తీకి సంబంధించిన వివాదంలో ప్రజా ప్రతినిధులు, ఇతరుల వ్యాఖ్యలపై ఆంక్షలు విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారిస్తోందని, ఈ సమయంలో కోర్టు జోక్యం చేసుకోవడం అపరిపక్వ చర్య అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషన్‌ను తోసిపుచ్చింది. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు సహా ఇతరులు మాట్లాడకుండా నియంత్రణ ఆదేశాలు(గ్యాగ్ ఆర్డర్) ఇవ్వాలని కోరుతూ మనూర్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గళ్లా మాధవితోపాటు ఏపీ, కేంద్ర ప్రభుత్వాలు, సీబీఐ, డీజీపీ, ఐజీ(గుంటూరు రేంజ్), ఎస్పీ, విజయవాడ పోలీస్ కమిషనర్ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు సహా ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ క్రమంలో నెయ్యి కల్తీపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా ఇతరులు మరిన్ని ప్రకటనలు చేయకుండా నిరోధించాలని, కల్తీ ఆరోపణలతో ఏర్పాటు చేసిన హోర్డింగులు, పోస్టర్లను తక్షణమే తొలగించేలా ఆదేశించాలని కోరారు. సీబీఐ సిట్ దాఖలు చేసిన చార్జిషీట్‌ను బహిర్గతం చేయాలని, శాంతిభద్రతల పర్యవేక్షణకు ఒక స్వతంత్ర యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ఆ పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో జస్టి స్ జోయ్‌మాల్య బాగ్చీ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే, పిటిషన్‌కు విచారణార్హత లేదని పేర్కొంటూ ధర్మాసనం దానిని డిస్మిస్ చేసిం ది. ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.
మిమ్మల్ని ఎవరు అడిగారు..?: సీజేఐ
తొలుత.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు ఉపయోగించారనే ఆరోపణలు తొలుత వచ్చాయని, కానీ, సిట్ నివేదికలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు లేవని, కేవలం.. రసాయనాలు మాత్రమే వినియోగించారని తేలిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో సీజేఐ స్పందిస్తూ.. ‘‘అసలు, కల్తీ వ్యవహారం గురించి మిమ్మల్ని ఎవరు అడిగారు?. మీరసలు ఎలా మాట్లాడుతున్నారు?. మీరేమైనా నిపుణులా?. మీకు ఈ విషయాలను ఎవరు చెప్పారు?.’’ అని తీవ్రంగా ప్రశ్నించారు. న్యాయవాది మరోసారి కలుగజేసుకుని.. తిరుమలలో లడ్డూ తయారీకి సంబంధించి కల్తీ వివాదంపై ఒకవైపు విచారణ జరుగుతోందని, మరోవైపు అత్యున్నత రాజ్యాంగ పదవుల్లోని వ్యక్తులు మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. అందుకే, కల్తీ వ్యవహారంపై మాట్లాడకుండా నియంత్రించేందుకు ఆదేశాలు(గ్యాగ్ ఆర్డర్) ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కానీ, పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది.
జోక్యం చేసుకోలేం..!
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుగుతోందని, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర పోలీసుల(సిట్) చేతుల్లోంచి దర్యాప్తును ఇప్పటికే సీబీఐకి బదిలీ చేశామని గుర్తు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దాఖలైన ఈ పిటిషన్‌ను పరిశీలించడం కుదరదని తెలిపింది. క్రిమినల్ కేసులో అనుమానితులుగా ఉన్న వారికి రక్షణ కల్పించే ఉద్దేశంతో పిటిషన్ దాఖలు చేసినట్లుగా కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏమైనా ఆధారాలు ఉంటే నేరుగా సీబీఐకి సమర్పించాలని సూచించింది. దర్యాప్తు త్వరగా కొలిక్కి వచ్చేందుకు అది దోహదపడుతుందని స్పష్టం చేసింది.