మేం జోక్యం చేసుకోం
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:41 AM
ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారం ఇప్పటికే టెలికాం వివాదాల పరిష్కార, అప్పిలేట్ ట్రైబ్యునల్ (టీడీ శాట్) పరిధిలో ఉన్నందున...
‘టెలికాం’ ట్రైబ్యునల్‌లోనే తేల్చుకోండి
ఏపీలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై సుప్రీంకోర్టు
ఇందిరా టెలివిజన్ పిటిషన్ కొట్టివేత
చట్టబద్ధ పరిష్కార మార్గాలు ఉన్నప్పుడు నేరుగా విచారణ చేయలేమన్న సుప్రీం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారం ఇప్పటికే టెలికాం వివాదాల పరిష్కార, అప్పిలేట్ ట్రైబ్యునల్ (టీడీ శాట్) పరిధిలో ఉన్నందున, అక్కడే తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ప్రస్తుత దశలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ‘ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏపీ ఫైబర్ నెట్ చానల్స్ ప్యాకేజీ నుంచి సాక్షి టీవీని తొలగించారు. మేజర్ ఎంఎస్వో ఆపరేటర్లను బెదిరించారు. రాష్ట్ర ప్రభుత్వమే మీడియా స్వేచ్ఛను హరిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19(1)(ఏ)ను ఉల్లంఘిస్తున్నారు. ఏపీ ఫైబర్ నెట్ నుంచి సాక్షి టీవీని తొలగించడం చట్టవిరుద్ధం. తిరిగి ప్యాకేజీ చానల్స్‌లో పెట్టేలా ఆదేశాలు జారీ చేయండి’ అని 2025 జూలై 19న ఇందిరా టెలివిజన్ లిమిటెడ్(సాక్షి టీవీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్ సోమవారం జస్టిస్ పీఎస్ నరసింహం, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఇందిరా టెలివిజన్ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికారులు, మల్టీ సిస్టమ్ ఆపరేటర్ల (ఎంఎస్వో) ద్వారా తమ ప్రసారాలను అక్రమంగా నిలిపివేశారని, బ్లాక్ అవుట్ చేశారని అన్నారు. ప్రసారాలను తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రసారాల నిలిపివేతకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ఆదేశాలు లేవని తెలిపారు.
ఇది కేవలం ప్రైవేట్ ఆపరేటర్లకు సంబంధించిన అంశమని తెలిపారు. దీంతో ఈ కేసు ట్రైబ్యునల్ పరిధిలో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో పిటిషనర్ తరపు న్యాయవాది మరికొన్ని అంశాలను ప్రస్తావిస్తూ విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేయాలని కోరారు. జస్టిస్ నరసింహ స్పందిస్తూ.. ఇప్పటికే ట్రైబ్యునల్‌ను ఆశ్రయించినందున, అక్కడ తీర్పు వచ్చిన తర్వాత హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. చట్టబద్ధమైన పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నప్పుడు నేరుగా సుప్రీంకోర్టు విచారణ కొనసాగించడం సమంజసం కాదన్నారు. ‘‘ట్రైబ్యునల్ ఇప్పటికే ఈ వ్యవహారాన్ని విచారణకు స్వీకరించింది. కాబట్టి రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం దాఖలైన ఈ పిటిషన్‌ను ఇప్పుడు విచారించలేం. పిటిషనర్ తన వాదనలను ట్రైబ్యునల్ ముందు వినిపించేందుకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ట్రైబ్యునల్ లేదా హైకోర్టు ఇచ్చే తీర్పుల పట్ల సంతృప్తి చెందని పక్షంలో మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు’’ అని ధర్మాసనం తెలిపింది.