రాజ్ కసిరెడ్డే ఆర్కిటెక్ట్!
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:39 AM
వేల కోట్ల మద్యం కుంభకోణం వ్యవహారంలో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిలు ఇవ్వడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ఆయనకు బెయిలిచ్చే ప్రసక్తే లేదు
ఇంకొన్నాళ్లు జైలులోనే ఉండనివ్వండి: సుప్రీం
రూ.3200 కోట్లు అంటే చిన్న విషయం కాదు.. ఏ7 ముప్పిడి అవినాశ్‌కు నీడలా రాజ్
ఆయన లొంగిపోతే బెయిలు గురించి చూద్దాం!.. సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి బెయిలు పిటిషన్ డిస్మిస్
నిందితులైన అధికారులను అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): వేల కోట్ల మద్యం కుంభకోణం వ్యవహారంలో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిలు ఇవ్వడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. మద్యం స్కామ్ రూపకర్త (ఆర్కిటెక్ట్) ఆయనే అని తేల్చి చెప్పింది. మరికొంతకాలం జైలులోనే ఉండనివ్వండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లేనిపక్షంలో... రాజ్ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏ7 ముప్పిడి అవినాశ్ సరెండర్ అయ్యేలా చేస్తే, అప్పుడు బెయిల్ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేసింది. జగన్ హయాంలో జరిగిన వేలకోట్ల మద్యం స్కామ్‌లో రాజ్ కసిరెడ్డిదే కీలక పాత్ర అని ‘సిట్’ తేల్చిన సంగతి తెలిసిందే. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు జనవరి 29న హైకోర్టు నిరాకరించింది. ఆ మరుసటి రోజునే రాజ్ కసిరెడ్డి దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘రాజ్ కసిరెడ్డి కేవలం ఐటీ సలహాదారు కాదు. ఈ మొత్తం స్కామ్‌కు ఆయనే ఆర్కిటెక్ట్. ఈ కేసులో నిందితుడైన ఏ7కు రాజ్ కసిరెడ్డి నీడలా వ్యవహరించారు. రూ.3,200 కోట్లు చిన్న మొత్తం కాదు. ఇంతటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. రాజ్ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏ7ను లొంగిపోయేలా చేస్తే... అప్పుడు బెయిల్ గురించి ఆలోచిస్తామని తెలిపారు.
ఆ అధికారులను వదిలేశారేం!?
రాజ్ కసిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘‘విచారణ సంస్థల తీరులో వివక్ష కనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే 10 మందికి బెయిల్ వచ్చింది. కానీ రాజ్ కసిరెడ్డి విషయంలోనే కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిజమైన కుట్రదారులుగా భావిస్తున్న ఉన్నతాధికారులు ఏ2, ఏ3, ఏ5లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? విజయ సాయిరెడ్డి వంటి వారు బయట తిరుగుతుంటే, రాజ్ కసిరెడ్డిని మాత్రం జైలులోనే ఉంచుతున్నారు’’ అని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... ఇతర నిందితులను అరెస్టు చేయకపోవడమంటే, రాజ్ కసిరెడ్డిని బెయిలుపై విడుదల చేయాలని కాదని తెలిపింది. అదే సమయంలో... ఈ కేసులో నిందితులైన అధికారులను అరెస్టు చేయకపోవడంపై తీవ్రంగా స్పందించింది. ఈ కుంభకోణంలో అధికారుల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తున్నా, వారిని అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. ‘‘పెద్ద పెద్ద బ్యూరోక్రాట్లు, నిర్ణయాలు తీసుకునే శక్తి ఉన్నవారు ఈ అక్రమాల్లో భాగస్వాములుగా ఉన్నప్పటికీ... బయట స్వేచ్ఛగా తిరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది’’ అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కొందరు నిందితులు ప్రభుత్వంలోనే కీలక పదవుల్లో కొనసాగుతుండటంపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అధికారులు పరారీలో లేకపోయినా, వారిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. ‘‘బ్యూరోక్రాట్లకు ప్రత్యేకమైన వెసులుబాట్లు (పివిలేజ్) ఉన్నాయా? వారి ప్రమేయం లేకుండా ఇంత పెద్ద కుంభకోణం ఎలా సాధ్యం?’’ అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. కీలక పదవిలో ఉన్న (రాజ్ కసిరెడ్డి) వ్యక్తులకు అధికారులు ఏదో ఒకలా సహాయం చేస్తారని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో రాజ్ కసిరెడ్డి తరఫు న్యాయవాది రంజిత్ కుమార్ తన వాదనలు వినిపిస్తూ... ‘‘స్కామ్‌లో బ్యూరోక్రాట్లకూ సమాన బాధ్యత ఉన్నప్పుడు... అందరికీ సమాన న్యాయం అందాలి కదా? రాజ్ కసిరెడ్డి మాత్రమే జైలులో ఉండడం ఎంతవరకు సమంజసం’’ అని ప్రశ్నించారు. ఇంతలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కలుగజేసుకుని... ‘‘ బ్యూరోక్రాట్ల ప్రమేయం ఉంటే వారిని కూడా అరెస్టు చేయమని అర్థం. అంతేతప్ప.. రాజ్ కసిరెడ్డిని విడుదల చేయాలని కాదు’’ అని తెలిపారు. తన క్లయింట్ కేవలం ‘ఐటీ అడ్వైజర్’ మాత్రమేనని, ఇప్పటికే 298 రోజులుగా జైల్లో ఉన్నారని రంజిత్ కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీజేఐ తీవ్రంగా స్పందించారు. ‘ఆయన కేవలం అడ్వైజర్ కాదు. మొత్తం స్కామ్‌కు ఆర్కిటెక్ట్’ అని తెలిపారు. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు ససేమిరా అనడంతో.. తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇవ్వాలని రంజిత్ కుమార్ అభ్యర్థించారు. ఆ విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం... ‘డిస్మి్‌సడ్ యాజ్ విత్ డ్రా’గా పేర్కొంటూ పిటిషన్‌పై విచారణను ముగించింది.
హైకోర్టు తీర్పు ఇలా...
జనవరి 29న రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలివి...
‘‘రాజ్ కసిరెడ్డి అప్పటి ముఖ్యమంత్రికి ఐటీ సలహాదారుగా ఉన్నారు. ఇది కాదనలేని వాస్తవం. ఇతర నిందితులతో కలిసి పన్నిన కుట్రలో భాగంగా ఆయన అనేక సమావేశాలు నిర్వహించినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. కసిరెడ్డి, ఆయన సిండికేట్‌కు ముడుపులు చెల్లించిన మద్యం బ్రాండ్‌లకు మాత్రమే సప్లై ఆర్డర్లు వెళ్లినట్లు సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారు. కొత్తమద్యం పాలసీ అమల్లోకి వచ్చిన వెంటనే... 2020లో అదాన్ డిస్టిలరీ్‌సను స్థాపించారు. ముప్పిడి అవినాశ్(ఏ7) ద్వారా కసిరెడ్డి దీనిని నియంత్రించినట్లు తెలుస్తోంది. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి కసిరెడ్డి, అవినాశ్ రెడ్డిలకు 732కోట్లు అందాయని ఆరోపణలున్నాయి. వాటిని ఉనికిలో లేని షెల్ కంపెనీలకు మళ్లించారు. షెల్ కంపెనీల నుంచి రూ.135కోట్లు వివిధ ఖాతాలకు బదిలీ చేసినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి. వాట్సాప్ చాట్, కాల్‌డేటా, ఎఫ్‌ఎ్‌సఎల్ నివేదికలు పరిశీలిస్తే... ఈ అక్రమ లావాదేవీల్లో కసిరెడ్డి పాత్ర స్పష్టమౌతుంది. కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడు ముప్పిడి అవినాశ్ పరారీలో ఉన్నారు. పిటిషనర్‌కు బెయిల్ మంజూరు చేస్తే పరారీలో ఉన్న అవినాశ్ రెడ్డిని చట్టం నుంచి తప్పించే అవకాశం ఉంది. దర్యాప్తునకూ ఆటంకం కలిగించే ప్రమాదం ఉంది. కసిరెడ్డి గతంలో విదేశాలకు వెళ్లి దర్యాప్తు నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించినట్లు గుర్తించాం. భారీ స్థాయిలో ప్రజా సొమ్మును దారి మళ్లించారు. ఇలాంటి ఆర్థిక నేరాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన నిందితుల పట్ల కఠిన వైఖరి అవసరం!’’