Share News

వారిపై బలవంతపు చర్యలొద్దు

ABN , Publish Date - May 31 , 2026 | 05:39 AM

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో నిందితులు దాసరిపల్లి జయచంద్రారెడ్డి, మంత్రి గిరిధర్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

వారిపై బలవంతపు చర్యలొద్దు

  • నకిలీ మద్యం కేసులో సుప్రీం ఆదేశం

  • జయచంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డికి ఊరట

న్యూఢిల్లీ, ములకలచెరువు, మే 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో నిందితులు దాసరిపల్లి జయచంద్రారెడ్డి, మంత్రి గిరిధర్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వారిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. అక్రమ మద్యం తయారీ కేసులో తమ పేర్లను చట్టవిరుద్థంగా చేర్చారని ఆరోపిస్తూ, ముందస్తు బెయిల్‌ కోసం వారు దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో వారిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌, జస్టిస్‌ కోటీశ్వర్‌సింగ్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. వాదనల సందర్భంగా, అక్రమ మద్యం తయారీ వ్యవహారంలో పిటిషనర్లకు ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం లేదని, రాజకీయ, వ్యక్తిగత కారణాలతో వారి పేర్లను కేసులో చేర్చారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పిటిషనర్లు విదేశాల్లో ఉన్నారని, అరెస్టు భయం నెలకొన్నందున స్వదేశానికి రావడానికి కూడా సంకోచిస్తున్నారని వివరించారు. పిటిషనర్ల వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు పిటిషనర్లపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. పిటిషనర్లు విదేశాల నుంచి తిరిగి వచ్చిన రెండు వారాల్లోపు దర్యాప్తు సంస్థ ఎదుట హాజరై విచారణకు సహకరించాలని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు, తదుపరి విచారణను జూలై 30కు వాయిదా వేసింది. రెండు వారాల్లోపు కౌంటర్‌ అఫిడవిట్‌ను, ఆ తర్వాత రెండు వారాల్లో రిజాయిండర్‌ అఫిడవిట్‌ను దాఖలుచేయాలని ఇరుపక్షాలకూ స్పష్టం చేసింది.


కాగా, అన్నమయ్య జిల్లా ములకలచెరువు కేంద్రంగా జరిగిన నకిలీ మద్యం తయారీ గుట్టును గత ఏడాది అక్టోబరు 3వ తేదీన ఎక్సైజ్‌ పోలీసులు రట్టు చేశారు. భారీగా నకిలీ మద్యం, తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి 35 మందిపై కేసు నమోదు చేసి 33మందిని అరెస్టు చేశారు. తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి(ఏ17), గిరిధర్‌రెడ్డి(ఏ18)లనూ నిందితులుగా చేర్చారు. కాగా, శనివారం సుప్రీంకోర్టు ఉత్తర్వులను జయచంద్రారెడ్డి సతీమణి కల్పనరెడ్డి ఎక్సైజ్‌ సీఐ కిశోర్‌కుమార్‌కు ఇచ్చారు.

Updated Date - May 31 , 2026 | 05:39 AM