Share News

జీతం వస్తోంది కదా.. సంతోషించండి!

ABN , Publish Date - Feb 28 , 2026 | 05:06 AM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నియామకాల(2018) వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకల...

జీతం వస్తోంది కదా.. సంతోషించండి!

  • నియమించిన చోట ఉద్యోగం చేయాల్సిందే

  • గ్రూప్‌-1 ఉద్యోగులకు సుప్రీంకోర్టు ఆదేశం

  • హైకోర్టు తీర్పును సమర్థించిన ధర్మాసనం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నియామకాల(2018) వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకల నేపథ్యంలో ఇప్పటికే సర్వీసులో ఉన్న వారికి ప్రాధాన్యత లేని(నాన్‌ ఫోకల్‌) పోస్టులు కేటాయించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే, ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కొందరు గ్రూప్‌-1 ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్‌ బిందాల్‌, జస్టిస్‌ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘‘నియామకాల్లో అవకతవకలు జరిగినప్పటికీ మీకు ఉద్యోగాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా జీతాలు వస్తున్నాయి కదా?.’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘మీకు ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇస్తే ఏంటి?. అప్రాధాన్య పోస్టులు ఇస్తే ఏంటి?. ఎక్కడ ఉన్నా మీరు డ్యూటీ చేయాల్సిందే. అసలు జీతాలు ఆగిపోకుండా వస్తున్నందుకు మీరు సంతోషపడాలి.’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాగుందని, ఆ తీర్పును తాము పూర్తిగా సమర్థిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం నియమించిన చోటే ఉద్యోగాలు చేయాలని ఆదేశిస్తూ పిటిషన్లను డిస్మిస్‌ చేసింది.

Updated Date - Feb 28 , 2026 | 05:06 AM