Share News

కాటసానికి చుక్కెదురు

ABN , Publish Date - Feb 25 , 2026 | 04:35 AM

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనకు భద్రత కల్పించాలన్న కాటసాని అభ్యర్థనను తోసిపుచ్చుతూ, ఆయన పిటిషన్‌పై విచారణను ముగించింది.

కాటసానికి చుక్కెదురు

  • భద్రత కల్పించాలన్న వైసీపీ నేత పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనకు భద్రత కల్పించాలన్న కాటసాని అభ్యర్థనను తోసిపుచ్చుతూ, ఆయన పిటిషన్‌పై విచారణను ముగించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎవరికి ఎంత భద్రత ఉండాలో? అసలు భద్రత ఉండాలా? వద్దా? అనే అంశాలను కోర్టులు నిర్దేశించలేవని స్పష్టం చేసింది. తనకు ఉన్న భద్రతను (2+2 పీఎ్‌సవో) ఉద్దేశ పూర్వకంగానే తొలగించారంటూ ఈ నెల 4న రాంభూపాల్‌ రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(సివిల్‌) దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉన్నందున, భద్రతను పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు డీజీపీ, సెక్యూరిటీ రివ్యూ కమిటీ, ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చారు. ఆ పిటిషన్‌ మంగళవారం చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, రాంభూపాల్‌ రెడ్డికి ప్రాణహాని ఉన్నదని, గతంలో ఆయన తండ్రితోపాటు ఆరుగురు కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కాటసానికి ప్రాణహాని ఉన్నదని గతంలో ఆయనను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారని, ఇప్పుడేమో ఎలాంటి ముప్పు లేదని చెబుతున్నారని అన్నారు. ప్రతిపక్ష నేతలకు భద్రతను తొలగించి, అధికార పార్టీ వారికి మాత్రం అవసరానికి మించిన భద్రత కల్పిస్తున్నారని తెలిపారు. ఒకే ప్రాంతంలో రెండు వర్గాలు ఉన్నప్పుడు, ఒక వర్గానికి పూర్తిస్థాయిలో భద్రతను కల్పించి, మరో వర్గానికి మాత్రం పూర్తిగా భద్రతను తొలగించడం సరికాదని వాదనలు వినిపించారు.


భద్రత కల్పిస్తే ఆ ఖర్చులను పిటిషనరే భరిస్తారన్నారు. అయితే, ఎవరికి ఎంత భద్రత కల్పించాలనే అంశాన్ని కోర్టులు నిర్దేశించబోవని ధర్మాసనం తెలిపింది. ‘‘మీరు మాజీ ప్రజా ప్రతినిధి. ఇప్పుడు ఏ పదవిలోనూ లేరు. మీదగ్గర ధన బలం మాత్రమే ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రాణహాని ఉందని భావిేస్త ప్రైవేట్‌ ఏజెన్సీల ద్వారా కూడా భద్రత కల్పించుకోవచ్చు. దానికి అడ్డం ఏమీ ఉండదు కదా?’’ అని సీజేఐ ప్రశ్నించారు. ప్రాణహాని అంచనా అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదని, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుందంటూ, రాంభూపాల్‌ రెడ్డి పిటిషన్‌ను బెంచ్‌ పరిష్కరించింది.

Updated Date - Feb 25 , 2026 | 04:35 AM