రెగ్యులర్ బెయిల్ కోసం.. ట్రయల్ కోర్టుకే వెళ్లండి!
ABN , Publish Date - Jan 22 , 2026 | 03:53 AM
జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
మద్యం స్కామ్ నిందితులకు సుప్రీం షాక్
హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ
ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పల పిటిషన్ కొట్టివేత
అరెస్టు నుంచి రక్షణ పొడిగింపు
ట్రయల్ కోర్టులో బెయిల్ రాకుంటే హైకోర్టును ఆశ్రయించవచ్చన్న బెంచ్
ఇందుకోసం వారికి 2 వారాలు వెసులుబాటు
న్యూఢిల్లీ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని అప్పటి సీఎంవో కార్యదర్శి కె.ధనుంజయ్‌రెడ్డి, నాటి సీఎం జగన్‌కు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. నిందితుల డీఫాల్ట్ బెయిల్‌ను రద్దుచేస్తూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. అయితే అరెస్టు నుంచి వారికి కల్పించిన మధ్యంతర రక్షణను పొడిగించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలితో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమకు మంజూరైన డీఫాల్ట్ బెయిల్‌ను హైకోర్టు గతేడాది నవంబరు 19న రద్దుచేయడాన్ని సవాల్ చేస్తూ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు. త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. రాష్ట్రప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూథ్రా, నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హైకో ర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. వారి పిటిషన్‌ను కొట్టివేసింది. అయి తే ట్రయల్ కోర్టును ఆశ్రయించి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చని వారికి సూచించింది. ట్రయల్ కోర్టు విచారణ జరిపేవరకు మధ్యంతర రక్షణ కొనసాగుతుందని.. ఒకవేళ బెయిల్ రాకపోతే తిరిగి హైకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా రెండు వారాలు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.