అనంతబాబుతో పోలీసుల కుమ్మక్కు
ABN , Publish Date - Feb 21 , 2026 | 04:12 AM
సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ్‌భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడు అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని తేల్చింది.
దర్యాప్తులో ఉద్దేశపూర్వకంగానే జాప్యం: సుప్రీం
డిఫాల్ట్ బెయిల్ అందేలా సహకరించారు
డ్రైవరు హత్య కేసులో దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం
ప్రభుత్వం మారగానే దర్యాప్తు వేగవంతం: లూథ్రా
మరి ఈ జాప్యానికి బాధ్యులైనవారిపై చర్యలేవీ?
కనీసం షోకాజ్ నోటీసు అయినా వారికి ఇచ్చారా?
2022 నుంచీ ‘బెయిల్’పైనే నిందితుడు
ఈ నాలుగేళ్లుగా దర్యాప్తు ముందుకు వెళ్లలేదేం?
ఎస్పీ, అధికారులను డీజీపీ నియంత్రించలేరా?
డీజీపీకి కొనసాగే అర్హత ఉందా?.. బెంచ్ ఆగ్రహం
నవంబరు 30 నాటికి విచారణ పూర్తికి ఆదేశం
న్యూఢిల్లీ, కాకినాడ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ్‌భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడు అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని తేల్చింది. ‘‘పోలీసులు, దర్యాప్తు సంస్థలు అనంతబాబుతో చేతులు కలిపాయి. అతనికి డిఫాల్ట్ బెయిల్ అందించడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి. పోలీసులు, రాజకీయ అధికారానికి మధ్య ఉన్న అనుబంధానికి ఇదే స్పష్టమైన నిదర్శనం. ఇది ఏమాత్రం ఉపేక్షించరాని తప్పు. అత్యంత హేయమైన నేరంలో పోలీసుల తీరు ఆక్షేపణీయం’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో, 2022 మే 19న అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహమై కనిపించారు. దీనిపై 5రోజుల తర్వాత అనంతబాబును పోలీసులు మేజిరేస్టట్ ముందు హాజరుపరిచారు. అనంతబాబు తన నేరాన్ని అంగీకరించారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. కాగా, ఈ కేసులో బెయిల్ కోసం అనంతబాబు చేసిన అభ్యర్థనను దిగువకోర్టు, హైకోర్టు నిరాకరించాయి. హైకోర్టు తీర్పును 21 అక్టోబరు 2022న అనంతబాబు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అప్పట్లో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. ఆ పిటిషన్ మరోసారి శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పోలీసులు, దర్యాప్తు సంస్థ వైఫల్యాలను ఎత్తిచూపుతూ సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పోలీసులు, దర్యాప్తు సంస్థల తీరు దారణంగా ఉంది. మరీ.. ఇంత నిర్లక్ష్యమా? ఒక వ్యక్తిని విచారణ పేరుతో లోపలే ఉంచడం లేదా విచారణను అనంతంగా పొడిగించడం అనే కొత్త ధోరణి కనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. నిందితుడు ఏళ్ల తరబడి మధ్యంతర బెయిల్‌పై బయట తిరుగుతుండడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఇది కచ్చితంగా అపవిత్ర బంధమే
పోలీసులు, అధికారపక్షం మధ్య అపవిత్ర బంధానికి అనంతబాబు వ్యవహారమే నిదర్శనమని కోర్టు మండిపడింది. నిందితుడితో పోలీసులు చేతులు కలిపారని స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ‘‘నిందితుడికి సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద డిఫాల్ట్ బెయిల్ సులభంగా వచ్చేలా పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నించారు. 2022 డిసెంబరు నుంచి నిందితుడు మధ్యంతర బెయిల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అత్యంత హేయమైన నేరం జరిగినప్పుడు ఇంత నిర్లక్ష్యమెలా వహిస్తారు? పోలీసులు, దర్యాప్తు సంస్థల పనితీరు ఇంత దారుణంగా ఉంటుందా?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. కాగా, నిందితుడికి పోలీసులు అన్ని విధాలా సహకరించారని, ఉద్దేశపూర్వకంగానే 92వ రోజున చార్జిషీట్ దాఖలు చేశారని బాధితుడి కుటుంబసభ్యులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా, ‘పోలీసుల ఉద్దేశాలన్నీ అర్థమవుతూనే ఉన్నాయి కదా?’ అని సీజేఐ వ్యాఖ్యానించారు.
మీరైనా చర్యలు తీసుకోండి: న్యాయమూర్తి
ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే దర్యాప్తును వేగవంతం చేశామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ‘‘హత్య జరిగినప్పుడు అనంతబాబుకు చెందిన పార్టీనే(వైసీపీ) అధికారంలో ఉంది. అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న నిందితుడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దర్యాప్తును ప్రభావితం చేయగలిగారు. 2024లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే, దర్యాప్తు వేగవంతం చేశాం. ఫోరెన్సిక్ నివేదిక లేకపోవడంవల్లే చార్జిషీటు అసంపూర్ణంగా ఉందని గ్రహించాం. ప్రస్తుతం సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేశాం’’ అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, నాలుగేళ్లుగా దర్యాప్తు పూర్తికాలేదా? కనీసం ఆ అధికారులకు షోకాజ్ నోటీసులైనా ఇచ్చారా? వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ‘నిర్లక్ష్యానికి బాధ్యులైనవారిపై మీరైనా చర్యలు తీసుకోండి’ అని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ అన్నారు.
డీజీపీకి పదవిలో ఉండే అర్హత ఉందా?: సీజేఐ
ఎస్పీ లేదా దర్యాప్తు అధికారిని నియంత్రించలేకపోతే, వారితో పనిచేయించుకోలేకపోతే ఇక డీజీపీకి ఆ అధికారం ఎందుకని సీజేఐ ప్రశ్నించారు. కిందిస్థాయి అధికారులను దారిలో పెట్టలేని, నియంత్రించలేని డీజీపీకి ఆ పదవిలో కొనసాగే అర్హత ఉందా? అని నిలదీశారు. ‘‘నిందితుడు 2022 నుంచి మధ్యంతర బెయిల్‌ను అనుభవిస్తున్నారు. కానీ నేటికీ దర్యాప్తు మాత్రం పూర్తికాలేదు. ఇది రాష్ట్ర పోలీసుల నిర్లక్ష్యం కాకపోతే మరేమిటి?’’ అని ప్రశ్నించారు. సాక్షులను బెదిరించడానికి ప్రయత్నించినా, ఆధారాలను మాయం చేయాలని చూసినా తదుపరి విచారణ లేకుండానే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించారు. నిందితుడి ప్రవర్తనను న్యాయస్థానం పరిశీలిస్తూనే ఉంటుందని, ఆయన ప్రవర్తన, నియమావళిని బట్టే ప్రస్తుతం అనుభవిస్తున్న ేస్వచ్ఛ ఎంతకాలం ఉంటుందనేది ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించింది.
కీలక మార్గదర్శకాలు..
ఈ ఏడాది నవంబరు 30 లోపు విచారణను పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. స్వయంగా పర్యవేక్షిస్తూ, వారానికి ఒకసారి ట్రయల్ కోర్టులో విచారణ జరిగేలా చూడాలని ఏపీ హైకోర్టును కోరింది. ఈ కేసు విచారణకు సంబంధించి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కేసు ట్రయల్ బాధ్యతను సీనియర్ జ్యుడీషియల్ అధికారికి అప్పగించాలని ఏపీ హైకోర్టుకు సూచించింది. మార్చి 14లోపు అభియోగాల రూపకల్పనపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. మార్చి 31 లోగా ఈ కేసులో ఏమైనా తదుపరి దర్యాప్తు ఉంటే పూర్తి చేయాలని ఆదేశించింది. ఏప్రిల్ 18 లోగా నిందితుడిపై అభియోగాల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పింది. అభియోగాలు నమోదు చేసిన వెంటనే, సాక్ష్యాల పరిశీలన లేదా సాక్షుల విచారణ ప్రక్రియను త్వరితగతిన ముగించాలని పేర్కొంది. ఆగస్టు 31లోపు మొత్తం 58 మంది సాక్షుల విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది. నవంబరు 30 నాటికి ఈ కేసు విచారణ ముగించాలని స్పష్టం చేసింది. ఈ కేసును ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించాలని ఏపీ హైకోర్టుకు సూచించింది. ప్రస్తుత కేసు విచారణను అత్యంత ప్రాధాన్య క్రమంలో వేగంగా చేపట్టేందుకు వీలుగా.. ట్రయల్ కోర్టు జడ్జిని ఇతర కేసుల బాధ్యతల నుంచి మినహాయించాలని తెలిపింది. ఈ కేసు విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ (స్టే విధిస్తూ) ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని హైకోర్టుకు స్పష్టం చేస్తూ, పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది.
బిగుస్తున్న ఉచ్చు..
సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలతో నాటి పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ ఘటన జరిగినప్పుడు కాకినాడ జిల్లా ఎస్పీగా రవీంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు. ఆయనతోపాటు అప్పటి అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీలు భీమారావు, మురళీ, సీఐ మురళీకృష్ణరెడ్డిపై వేటు తప్పదని ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి. అప్పటి జిల్లా ఎస్పీ రాయలసీమకు చెందిన అధికారి కావడంతోపాటు, అప్పటి సీఎం జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉండడంతో అనుమానాస్పద హత్యగా నమోదు చేయడానికి ప్రయత్నించారు. బాధితులు, దళితసంఘాలతో ఆందోళనలతో కేసును హత్య కేసుగా మార్చారు. కానీ, అనంతబాబును అరెస్ట్ చేయడానికి కనీసం ప్రయత్నం చేయలేదు. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో అనంతబాబును అరెస్ట్ చూపించారు. అరెస్టు సమయంలో, జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో అనంతబాబు గారు అని సంబోధించి భక్తి చాటుకున్నారు. హత్య జరిగిన ఘటనా స్థలిలో సీసీ ఫుటేజీలను సేకరించలేదు. నిందితుల కాల్ రికార్డులు సేకరించలేదు. గూగుల్ టేకవుట్ కోసం సకాలంలో ప్రయత్నించాల్సి ఉన్నా, జాప్యం చేయడంతో ఆ ఆధారాలు లభ్యం కాలేదు. హత్య అనంతరం అనంతబాబు నుంచి పోలీసులు ఐ ఫోన్‌ను సీజ్ చేశారు. కానీ పాస్‌వర్డ్‌ను తీసుకోలేదు. దీంతో ఇప్పటికీ ఐఫోన్‌ను తెరవలేదు. పైగా అనంతబాబుకు నేర చరిత్ర లేదంటూ చార్జిషీటులో పోలీసులు తమ భక్తిని మరోసారి చాటుకున్నారు.