Share News

హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది మెడమల్లి బాలాజీ

ABN , Publish Date - Jan 29 , 2026 | 04:02 AM

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది మెడమల్లి బాలాజీని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది.

హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది మెడమల్లి బాలాజీ

  • కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు

అమరావతి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది మెడమల్లి బాలాజీని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని కొలీజియం బుధవారం సమావేశమై ఆయన పేరుకు ఆమోదం తెలిపింది. నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32గా ఉంది. కొలీజియం సిఫారసును కేంద్రం ఆమోదిస్తే బాలాజీతో కలిపి ఆ సంఖ్య 33కి చేరుతుంది.

బాలాజీ నేపథ్యమిదీ.. మెడమల్లి బాలాజీది వ్యవసాయ నేపథ్య కుటుంబం. లక్ష్మీనరసమ్మ, సుబ్బయ్యనాయుడు దంపతులకు 1972 మే 29న జన్మించారు. ఆయన స్వస్థలం కడప జిల్లా రాజంపేట మండలంలోని శేషన్నగారిపల్లి గ్రామం. తండ్రి సుబ్బయ్య నాయుడు సహకార సెంట్రల్‌ బ్యాంకులో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. పాఠశాల విద్యను రాజంపేటలో పూర్తిచేసిన బాలాజీ తిరుపతి శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్‌ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. హైదరాబాద్‌లోని పడాల రామిరెడ్డి న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1998 ఏప్రిల్‌ 9న న్యాయవాదిగా బార్‌కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌ అయ్యారు. రాజ్యాంగ సంబంధ అంశాలు, సివిల్‌, క్రిమినల్‌, సర్వీసు, కమర్షియల్‌ కేసులు వాదించడంలో ఆయనకు అపార అనుభవం ఉంది. 2004 నుండి 2006 వరకు అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) కార్యాలయానికి అనుబంధంగా ఏజీపీగా సేవలు అందించారు. 2018-19 మధ్య విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. వివిధ ప్రతిష్ఠాత్మక సంస్థలు, బ్యాంకులకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలు అందించారు.

Updated Date - Jan 29 , 2026 | 04:02 AM