ఆకివీడు రామాలయానికి సుప్రీం పచ్చజెండా
ABN , Publish Date - Jul 28 , 2026 | 05:25 AM
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పురాతన శ్రీరామాలయ పునర్నిర్మాణానికి ఎదురైన న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. ఆలయ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.
జయంతి ఉన్మత్త పిటిషన్ కొట్టివేత
కలెక్టర్, అధికారులు ఎన్‌వోసీ ఇచ్చారు
అభ్యంతరాలుంటే హైకోర్టులో రిట్ వేసుకోండి
న్యూఢిల్లీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పురాతన శ్రీరామాలయ పునర్నిర్మాణానికి ఎదురైన న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. ఆలయ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి దాఖలైన ‘జయంతి ఉన్మత్త వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది. మెరిట్స్ ఆధారంగా తమ వాదనలు వినాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరారు. ఈ సందర్భంగా.. ఒకే న్యాయవాది, ఒకే వివాదానికి సంబంధించి వేర్వేరు స్థానికుల పేర్లతో పదే పదే పిటిషన్లు దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదే కేసుకు సంబంధించి గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకున్నారో చెప్పాలని ప్రశ్నించింది. దశాబ్దాలనాటి ఆలయ పునర్నిర్మాణానికి కలెక్టర్, నగర పంచాయతీ అధికారులు ఎన్‌వోసీ జారీ చేశారని, ఇప్పటికే ఉన్న 4సెంట్ల(194 చదరపు గజాలు) స్థలంలో మాత్ర మే ఆలయ నిర్మాణం జరగాలని, హద్దులు దాటవద్దని అందులో స్పష్టంగా ఉందని గుర్తుచేసింది. ఆ భూమి ప్రభుత్వానిదేనని, ఇతరులెవరికీ ఎటువంటి యాజమాన్య హక్కులూ ఉండవని కలెక్టర్ స్పష్టం చేశారని పేర్కొంది. సదరు ఎన్‌వోసీలో అభ్యంతరాలు ఉంటే హైకోర్టులోనే కొత్తగా రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని తేల్చిచెప్పింది. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
ఇది శ్రీరాముడి విజయం: రఘురామ
ఆకివీడు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు తీర్పుపై డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు హర్షం వ్యక్తంచేశారు. ‘ఇది శ్రీరాముడి విజ యం. పెదపేట రామాలయం పునర్నిర్మాణ పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి’ అని వీడియో ప్రకటన విడుదల చేశారు. న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ గతంలో ఐదుసార్లు పలువురితో హైకోర్టులో పిటిషన్లు వేయించారని, అవన్నీ తిరస్కరణకు గురయ్యాయని.. దీంతో సుప్రీంను ఆశ్రయించారన్నారు. ఆలయానికి సంబంధించి కృష్ణశిల పనులు గన్నవరం ఆశ్రమంలో జరుగుతున్నాయని తెలిపారు.