ఏఐ కల్పిత తీర్పులతో జాగ్రత్త
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:54 AM
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ఆధారంగా రూపొందించిన కల్పిత తీర్పు ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ దిగు వ కోర్టులను సుప్రీంకోర్టు అప్రమత్తం చేసింది.
వాటి వినియోగంతో న్యాయ ప్రక్రియ
దుర్వినియోగమయ్యే ప్రమాదం
వాటిపై ఆధారపడి తీర్పులు ఇవ్వొద్దు
ఏపీ హైకోర్టు తీర్పును పక్కనపెట్టిన సుప్రీం
న్యూఢిల్లీ, మార్చి 2 : కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ఆధారంగా రూపొందించిన కల్పిత తీర్పు ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ దిగు వ కోర్టులను సుప్రీంకోర్టు అప్రమత్తం చేసింది. కల్పిత ఏఐ తీర్పుల ఆధారంగా తీసుకునే నిర్ణయాల వల్ల న్యాయ ప్రక్రియ దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. ఏఐ కల్పిత తీర్పులు సరైన న్యాయ ప్రమాణాలతో ఉన్నాయనే కారణంగా వాటిని ఉత్తర్వుల్లో ఉటంకించడాన్ని అనుమతిం చరాదని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఏపీ హైకోర్టు తీర్పును పక్కనబెట్టింది. ఓ ఆస్తి వివాదంలో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైంది. ఆ ఉత్తర్వులు ఇచ్చే సమయంలో దిగువ కోర్టు ఏఐ కల్పిత తీర్పులను తన ఉత్తర్వుల్లో పేర్కొందని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. పిటిషన్‌లో లేవనెత్తిన అభ్యంతరాలను ఏపీ హైకోర్టు అంగీకరించింది. అయితే, దిగువ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యానికి మాత్రం నిరాకరించింది. ఈ మేరకు గత ఏడాది ఆగస్టులో తీర్పును ఇచ్చింది. దీనిపై పిటిషనర్లు గత జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయ మూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. పిటిషనర్ల వాదనను బెంచ్ అంగీకరించింది. పిటిషనర్ వ్యాజ్యాన్ని మరోసారి విచారించాలని, ఈసారి ఏఐ కల్పిత తీర్పులతో నిండిన అడ్వకేట్-కమిషనర్ నివేదికపై ఆధార పడొద్దని ఏపీ హైకోర్టును ఆదేశించింది. ఏఐ కల్పిత తీర్పుల విషయంలో చేపట్టాల్సిన చర్యలను సూచించాలంటూ సొలిసిటర్ జనరల్‌కు, భారత బార్ అసోసియేషన్‌కు బెంచ్ నోటీసులు జారీచేసింది.
కేసు వివరాలు...
ఓ సివిల్ వివాదంలో విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు అడ్వకేట్-కమిషనర్ తన నివేదికను సమర్పించారు. ఆ నివేదిక పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్లు గుమ్మడి ఉషారాణి, సునీత అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన విజయవాడ కోర్టు న్యాయాధికారి... అడ్వకేట్ కమిషనర్ నివేదిక సాక్ష్యం మాత్రమేనని, దాని పై అభ్యంతరం ఉంటే ట్రయల్ సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్‌లో తేల్చుకోవాలని తెలిపారు. అనుబంధ పిటిషన్‌ను కొట్టివేస్తూ గత ఏడాది ఆగస్టు 19న ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్భంగా నాలుగు తీర్పులను తన ఉత్తర్వుల్లో న్యాయాధికారి ఉదహరించారు. దిగువ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా పిటిషనర్ ఉషారాణి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ...దిగువ కోర్టు న్యాయాధికారి ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రస్తావించిన నాలుగు తీర్పులు ఉనికిలోనే లేవన్నారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్ధించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు,... న్యాయాధికారి నుండి నివేదిక కోరారు. న్యాయాధికారి నివేదిక సమర్పిస్తూ.... మొదటిసారి ఏఐ సాధనాన్ని వినియోగించానని, అది చూపిన తీర్పులు సరైనవేనని నమ్మి, వాటిని తన ఉత్తర్వుల్లో ఉదహరించానని , భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటానని తెలిపారు. ఆ నివేదికను పరిశీలించిన హైకోర్టు.. ప్రస్తుత కేసుకు న్యాయాధికారి సరైన న్యాయసూత్రాలనే అన్వయింపజేశారని తెలిపారు. ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలు లేనందున దిగువ కోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సివిల్ రివిజన్ పిటిషన్‌ను కొట్టివేశారు. ఏఐ సాధనాలు వినియోగం విషయంలో అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తతతో వ్యవహారించాలని దిగువకోర్టులకు ఈ సందర్భంగా హైకోర్టు సూచించింది.