హైకోర్టు రివ్యూ ఆర్డర్‌పై అప్పీల్ వేసుకోండి
ABN , Publish Date - Jul 15 , 2026 | 05:07 AM
వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన లింగాల రామలింగారెడ్డి (వేల్పుల రా ము) సుప్రీం కోర్టులో దాఖలు పిటిషన్‌పై విచారణను ధర్మాసనం ఆగస్టు 7కి వాయిదా వేసింది.
రామలింగారెడ్డి ఎన్నికల పిటిషన్‌పై సుప్రీం
ఆగస్టు 7కు విచారణ వాయిదా
న్యూఢిల్లీ, జూలై 14(ఆంధ్రజ్యోతి): వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన లింగాల రామలింగారెడ్డి (వేల్పుల రా ము) సుప్రీం కోర్టులో దాఖలు పిటిషన్‌పై విచారణను ధర్మాసనం ఆగస్టు 7కి వాయిదా వేసింది. కింది కోర్టు ఇచ్చిన రివ్యూ ఆర్డర్‌ను సవాలు చేస్తూ కొత్త పిటిషన్ వేసుకోవడానికి సుప్రీంకోర్టు ఆయనకు అవకాశం కల్పించింది. గత ఎన్నికల్లో ఆర్‌జేడీ అభ్యర్థిగా పోటీ చేసిన రామలింగారెడ్డిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద పోలీసులు కేసు నమోదు చేసి పులివెందుల కోర్టులో చార్జ్‌షీట్ వేశారు. అయితే, ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు పెట్టేటప్పుడు పోలీసులు నేరుగా చార్జ్‌షీట్ వేయడానికి వీల్లేదని, సంబంధిత అధికారే కోర్టుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని చట్టం చెబుతోందని రామలింగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు అనుసరించిన విధానం తప్పు అని హైకోర్టు తేల్చింది. అయితే, ఆర్డర్‌లో ప్రభుత్వ ఉత్తర్వుల అమలుపై స్పష్టత లేకపోవడంతో రామలింగారెడ్డి సుప్రీంలో సవాల్ చేశారు. ఆ పిటిషన్ మంగళవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. రామలింగారెడ్డి తరఫు లాయర్ వాదనలు విన్న ధర్మాసనం కిందికోర్టు రివ్యూ సంతృప్తికరంగా లేకపోతే దానినే సవాల్ చేస్తూ అ ప్పీల్ చేసుకోవాలని సూచించింది. కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థించగా అనుమతి ఇచ్చింది.