పర్యవేక్షణ కరువు!
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:21 AM
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో కీలకమైన ప్రభుత్వ గవర్నమెంట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ పోస్టు నెల రోజులుగా భర్తీకి నోచుకోలేదు. దీంతో నగరంలోని న్యూ జీజీహెచ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ప్రభుత్వాస్పత్రులపై పర్యవేక్షణ కరువైంది. సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినా, ఆయన రెండు బాధ్యతలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో నిత్యం మూడు వేల ఓపీ ఉండే జీజీహెచ్ విషయంలో పాలకుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- ఖాళీగా న్యూ జీజీహెచ్ సూపరింటెండెంట్ పోస్టు
- నెలరోజులుగా భర్తీ చేయని వైద్యారోగ్యశాఖ
- సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు
- రెండు కీలకమైన బాధ్యతలు కావడంతో ఎదురవుతున్న ఇబ్బందులు
- జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్
- 3 వేల ఓపీ ఉండే జీజీహెచ్ విషయంలో నిర్లక్ష్యంపై విమర్శలు
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో కీలకమైన ప్రభుత్వ గవర్నమెంట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ పోస్టు నెల రోజులుగా భర్తీకి నోచుకోలేదు. దీంతో నగరంలోని న్యూ జీజీహెచ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ప్రభుత్వాస్పత్రులపై పర్యవేక్షణ కరువైంది. సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినా, ఆయన రెండు బాధ్యతలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో నిత్యం మూడు వేల ఓపీ ఉండే జీజీహెచ్ విషయంలో పాలకుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ప్రభుత్వ గవర్నమెంట్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎ.వెంకటేశ్వరరావు నెల రోజుల కిందట పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో కొత్తగా ఎవర్ని నియమించలేదు. సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎ.ఏడుకొండలరావుకు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇది జరిగి నెల రోజులు అవుతున్నా ఇప్పటి వరకు రెగ్యులర్ సూపరింటెండెంట్‌ను నియమించలేదు. ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా ఉన్న ఏడుకొండలరావు సిద్ధార్థ మెడికల్ కాలేజీ బాధ్యతలను కూడా చూస్తున్నారు. ఆస్పత్రుల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు.
గాడితప్పుతున్న పాలన
కోస్తా జిల్లాల్లోని పేదలకు విశేష సేవలు అందిస్తున్న న్యూ జీజీహెచ్‌కు సూపరింటెండెంట్ లేకపోవటంతో పాలన గాడి తప్పుతోంది. న్యూ జీజీహెచ్ ప్రాంగణంలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు పాత ప్రభుత్వాస్పత్రిని కూడా సూపరింటెండెంట్ పర్యవేక్షించాల్సి ఉంది. రాష్ట్ర వైద్యరంగానికే గుండెకాయగా ఉన్న విజయవాడలో కీలక ఆస్పత్రులను పర్యవేక్షించాల్సిన సూపరింటెండెంట్ పోస్టు విషయంలో వైద్యారోగ్యశాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో కొద్ది రోజులుగా ఆస్పత్రుల్లో పాలన గాడితప్పుతోంది. వైద్యులు సరిగా అందుబాటులో ఉండక.. పరీక్షలు త్వరగా జరగక.. రోజుల తరబడి ఆస్పత్రులకు తిరుగుతూ రోగులు అవస్థలు పడే పరిస్థితి తలెత్తుతోంది.
పర్యవేక్షణ లేక పనుల్లో జాప్యం
ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ అంటే వైద్యుల అధిపతి. ఆస్పత్రుల మొత్తం నిర్వహణ అంతా ఆయన చేతుల మీదుగానే నడుస్తుంది. వైద్య సేవల నాణ్యత నుంచి సిబ్బంది బాధ్యతల వరకు అన్నింటినీ పర్యవేక్షిస్తేనే వ్యవస్థ గాడిలో ఉంటుంది. ప్రస్తుతం న్యూ జీజీహెచ్‌కు రెగ్యులర్ సూపరింటెండెంట్ లేకపోవటంతో గందరగోళంగా మారుతోంది. ముఖ్యమైన యాక్సిడెంట్, సూసైడ్ కేసులకు సంబంధించిన వివరాలు జీజీహెచ్‌లో ఎవరితో మాట్లాడాలో తెలియని పరిస్థితిని నగరంలోని ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలో చేపడుతున్న నిర్మాణాల మీద పర్యవేక్షణ కూడా కొరవడింది. దీంతో కొత్త ఆస్పత్రిలో నాలుగో బ్లాక్ నిర్మాణ పనులు, పాత ఆస్పత్రిలో నిర్మిస్తున్న భవనాల పనులను పర్యవేక్షించలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా పనుల్లో జాప్యం జరుగుతోంది.
వైద్యులు, సిబ్బందిలో ఉదాసీనత
ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరవుతున్నారా లేదా, వైద్యులు, ఉద్యోగులు క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారా లేదా వంటివి పరిపాలన వ్యవహారాల కిందకు వస్తాయి. ప్రభుత్వం కేటాయించిన నిధులతో మందులు, పరికరాలు, ఇతర అవసరమైన స్టేషనరీని కొనుగోలు చే సి అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. రోగులకు మందుల కొరత లేకుండా చూడటమన్నది ప్రధాన పరిపాలన బాధ్యత. రోగుల నమోదు, చికిత్స వివరాలు, జనన, మరణాలు వంటి అన్ని రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించేలా చూడాల్సి ఉంది. సూపరింటెండెంట్ లేకపోవటంతో ఇవన్నీ గాడి తప్పాయి. విధి నిర్వహణ సమయంలో వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్ లేకుండా చూడాల్సి ఉంది. లేదంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వంపైన ప్రభావితం చూపే అవకాశం ఉంటుంది. పూర్తిస్థాయి పర్యవేక్షణ లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది ఆయా అంశాల్లో ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు.