Share News

సునీల్‌ నాయక్‌ వారెంట్‌ పిటిషన్‌పై తీర్పు 3కి వాయిదా

ABN , Publish Date - Mar 01 , 2026 | 06:38 AM

నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును పోలీస్‌ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఏ-7 నిందితుడుగా ఉన్న ఐపీఎస్‌ అధికారి సునీల్‌ నాయక్‌పై...

సునీల్‌ నాయక్‌ వారెంట్‌ పిటిషన్‌పై తీర్పు 3కి వాయిదా

గుంటూరు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును పోలీస్‌ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఏ-7 నిందితుడుగా ఉన్న ఐపీఎస్‌ అధికారి సునీల్‌ నాయక్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ పిటిషన్‌ కేసులో వాదనలు పూర్తయ్యాయి. శనివారం గుంటూరులోని మొబైల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో సునీల్‌ నాయక్‌ తరఫు న్యాయవాదుల వాదనలను మేజిస్ట్రేట్‌ విన్నారు. ఇరువైపులా వాదనలు పూర్తి కావడంతో మార్చి 3వ తేదీన తీర్పు ఇవ్వనున్నట్లు మేజిస్ట్రేట్‌ స్రవంతి ప్రకటించారు. కాగా బిహార్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారులను అరెస్టు చేయాల్సి వస్తే తప్పనిసరిగా తమ అనుమతి తీసుకోవాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు సునీల్‌ నాయక్‌ ముందస్తు బెయిల్‌ కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది సోమవారం హైకోర్టు ధర్మాసనం ఎదుటకు రానుంది. సునీల్‌ నాయక్‌ను మార్చి 2వ తేదీ వరకు అరెస్ట్‌ చేయవద్దంటూ పట్నా సెషన్స్‌ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీటన్నింటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజును కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేసిన కేసులో సునీల్‌ నాయక్‌ అరెస్టు రోజురోజుకు జఠిలంగా మారుతోంది. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే సునీల్‌ నాయక్‌ను కస్టడీకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సునీల్‌ నాయక్‌ను అరెస్టు చేయడానికి.. బిహార్‌ ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు లేదా సుప్రీం కోర్టును ఆశ్రయించాలని పోలీసులు యోచిస్తున్నారు.

Updated Date - Mar 01 , 2026 | 06:38 AM