5లోపు హాజరవ్వండి
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:00 AM
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని అప్పటి సీఐడీ డీఐజీ, ప్రస్తుతం బిహార్ హోం గార్డులు/ఫైర్ ఐజీగా ఉన్న సునీల్ కుమార్ నాయక్‌ను హైకోర్టు ఆదేశించింది.
దర్యాప్తు అధికారి ముందుకు రావాలని ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టు ఆదేశం
ఉ.10 నుంచి సాయంత్రం 5 వరకు
తదుపరి విచారణ దాకా రోజూ వెళ్లాలి
ఆయనపై కఠిన చర్యలకు పాల్పడొద్దు
చట్ట నిబంధనలకు లోబడి విచారించాలి
విచారణాధికారికి న్యాయమూర్తి స్పష్టీకరణ
రఘురామపై హత్యాయత్నం కేసులో.. ముందస్తు బెయిల్‌పై విచారణ 9కి వాయిదా
విచారణకు సహకరించాల్సిన చట్టబద్ధమైన విధి పిటిషనర్ సునీల్ నాయక్‌పై ఉంది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోకుండా పట్నా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రక్షణగా వాడుకోవడానికి వీల్లేదు. విచారణ నిమిత్తం దర్యాప్తు అధికారి ముందు హాజరుకావలసిందే.
- హైకోర్టు
అమరావతి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని అప్పటి సీఐడీ డీఐజీ, ప్రస్తుతం బిహార్ హోం గార్డులు/ఫైర్ ఐజీగా ఉన్న సునీల్ కుమార్ నాయక్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 5న లేదా అంతకంటే ముందే హాజరుకావాలని స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి సూచనల మేరకు తదుపరి విచారణ వరకు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విచారణ నిమిత్తం వెళ్లాల్సిందేనని తేల్చిచెప్పింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఎలాంటి కఠిన చర్యలకు పాల్పడకుండా.. చట్ట నిబంధనలకు లోబడి సునీల్ నాయక్‌ను విచారించాలని దర్యాప్తు అధికారికి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తనను సీఐడీ అధికారులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని పేర్కొంటూ రఘురామరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2024 జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందుస్తు బెయిల్ కోరుతూ బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన సునీల్ నాయక్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఆయన తరఫున తరఫున సీనియర్ న్యాయవాది పరమేశ్వర్ వాదనలు వినిపించారు. బిహార్ (పట్నా) సెషన్స్ కోర్టు ట్రాన్సిట్ మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని, అది సోమవారంతో ముగుస్తున్నందున.. మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశామని తెలిపారు. ‘పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మొదట పిటిషనర్ పేరు లేదు. రాజకీయ కారణాలతో ఆ తర్వాత మెమో దాఖలు చేసి నిందితుడిగా చేర్చారు. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులను ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఓ కేసు విషయంలో అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును హైదరాబాద్‌లో అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. అంతటితో సునీల్ నాయక్ పాత్ర ముగిసింది. కస్టోడియల్ టార్చర్‌తో ఆయనకు సంబంధం లేదు. ఆయన టార్చర్ చేసినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు. సాక్షులు వాంగ్మూలాల్లో సైతం.. ఘటన జరిగినప్పుడు ఆయన అక్కడ ఉన్నారని మాత్రమే చెప్పారు. పిటిషనర్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఈ ఏడాది జనవరిలో గుంటూరు కోర్టు తిరస్కరించింది. పిటిషనర్ వేరే రాష్ట్రంలో ఉన్నందున బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 179 కింద పోలీసులిచ్చిన నోటీసులు చెల్లుబాటు కావు. ఆయన విచారణకు రావడం లేదన్న ఆరోపణలో వాస్తవం లేదు. పోలీసులు అరెస్టు చేస్తారనే ఆందోళన ఉంది. వ్యాజ్యంపై నిర్ణయం వెల్లడించేవరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయండి’ అని కోరారు.
వాస్తవాలు దాచి పిటిషన్ వేశారు..
పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది సిద్థార్థ్ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. సునీల్ నాయక్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. ‘పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బిహార్ (పట్నా) మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అదుపులోకి తీసుకునే సమయంలో అరెస్టుకు కారణాలను పోలీసులు ఆయనకు అందజేశారు. అరెస్టు విధానంలో లోపాలు ఉన్నాయంటూ ట్రాన్సిట్ రిమాండ్ ఇచ్చేందుకు మేజిస్ట్రేట్ నిరాకరించారు. దర్యాప్తునకు సహకరిస్తానని సునీల్ నాయక్ ఇచ్చిన హామీని పరిగణనలోకి తీసుకుని 2025లో పట్నా హైకోర్టు అరెస్టు విషయంలో ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించింది. పిటిషనర్ వేసిన వ్యాజ్యంలో ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారు. ఘటన జరిగినప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు? రఘురామరాజును ఎవరు టార్చర్ చేశారనే విషయాలను పిటిషనర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉంది. ముందస్తు బెయిల్ కోరుతూ సునీల్ నాయక్ వేసిన పిటిషన్‌ను గుంటూరు కోర్టు ఈ ఏడాది జనవరి 9న కొట్టివేసింది. ఆ ఉత్తర్వులను పిటిషనర్ ఇప్పటివరకు సవాల్ చేయలేదు. ఆయన దర్యాప్తునకు సహకరించడం లేదు.’ అని పేర్కొన్నారు. సునీల్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలంటూ గుంటూరు కోర్టులో వేసిన పిటిషన్‌ను తాము ఉపసంహరించుకున్నామని తెలిపా రు. ఇరు పక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పోలీసులు మొద ట నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేదనే కారణంతో దర్యాప్తు నుంచి తప్పించుకోలేరని.. ఎఫ్‌ఐఆర్ లో అందరి నిందితుల పేర్లు చేర్చాల్సిన అవసరం లే దన్నారు. దర్యాప్తు సాగుతున్న కొద్దీ మరింతమంది నిందితులను గుర్తించే అవకాశం ఉందన్నారు.