సునీల్ నాయక్‌పై వారెంట్
ABN , Publish Date - Feb 27 , 2026 | 02:24 AM
నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్‌కు గురిచేసిన కేసులో ఏ-7 నిందితుడిగా ఉన్న బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి ఎం.సునీల్ నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
గుంటూరు మొబైల్ మెజిస్ట్రేట్ కోర్టు జారీ
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ-7
పట్నాలోనే ఉన్న ఐపీఎస్ దామోదర్ బృందం
గుంటూరు, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్‌కు గురిచేసిన కేసులో ఏ-7 నిందితుడిగా ఉన్న బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి ఎం.సునీల్ నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. గురువారం గుంటూరులోని మొబైల్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. అధికారిక ఉత్తర్వులు శుక్రవారం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. బిహార్‌లో హోంగార్డ్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ ఐజీగా విధులు నిర్వహిస్తున్న నాయక్‌ను అరెస్టు చేసేందుకు విజయనగరం ఎస్పీ దామోదర్ నేతృతంలో 12 మంది ఏపీ పోలీసుల బృందం పట్నాకు వెళ్లిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయనను అరెస్టు చేసి, వైద్య పరీక్షల అనంతరం ఏపీకి తీసుకువచ్చేందుకు ట్రాన్సిట్ వారెంట్ కోసం స్థానిక కోర్టులో హాజరుపరచారు. అయితే మేజిస్ట్రేట్ ట్రాన్సిట్ వారెంట్ రిమాండ్‌ను తిరస్కరించారు. వందలాదిమంది బిహార్ పోలీసులు కోర్టుకు చేరుకొని నాయక్‌ను విడిపించుకుని వెళ్లారు. దీంతో మంగళవారం గుంటూరులోని మొబైల్ మెజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు నాన్ బెయిలబుల్ వారెంట్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అదే రోజు ప్రాసిక్యూషన్స్ జాయింట్ డైరెక్టర్ వీరగంధం రాజేంద్రప్రసాద్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు మేజిస్ట్రేట్‌కు అందించి వాదనలు వినిపించారు. రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్‌కు గురి చేసిన సమయంలో ఆ గదిలో సునీల్ నాయక్ ఉన్నట్లు పక్కా ఆధారాలు ఉన్నాయని, ఆయనను కస్టడీకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సునీల్ నాయక్‌కు ప్రొటెక్షన్ కల్పిస్తూ పట్నా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలకు ఎటువంటి విలువా లేదని గురువారం విచారణలో తెలిపారు. ఈ కేసు ఆ కోర్టు పరిధిలోకి రాదని, తనకు అధికారం లేకపోయినా అక్కడి న్యాయాధికారి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
ఇంతకుముందే సునీల్ నాయక్ గుంటూరు రెండో అదనపు జూనియర్ జడ్జి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు పిటిషన్ కొట్టి వేసిందన్నారు. దీనిపై ఆయన ముందస్తు బెయిల్‌కు, లేదంటే ప్రొటెక్షన్‌కు వెళ్లాలనుకుంటే ఏపీ హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు వెళ్లాలని.. ఇతర రాష్ట్రాల్లోని కోర్టులకు ఆయనకు ప్రొటెక్షన్ ఇచ్చే అధికారం ఉండదని అన్నారు. సునీల్ నాయక్ తరఫు న్యాయవాదులు మార్చి 2 వరకు ప్రొటెక్షన్ ఉందని మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సునీల్ నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తున్నట్లు మేజిస్ట్రేట్ స్రవంతి ప్రకటించారు. ఉత్తర్వులు అందిన తర్వాత ఏపీ పోలీసులు చట్ట ప్రకారం సునీల్ నాయక్‌ను అరెస్టు చేసేందుకు ముందడుగు వేయనున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసు విచారిస్తున్న ఎస్పీ దామోదర్ బృందం ప్రస్తుతం పట్నాలోనే ఉన్నారు.