నిజాలు ఎందుకు దాస్తున్నారు..?
ABN , Publish Date - Mar 09 , 2026 | 05:41 AM
రఘురామరాజుపై మీ ఫిర్యాదు ఆధారంగానే దేశద్రోహం కేసు నమోదు చేశారు.. హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.. కేసు నమోదు, అరెస్టు జరిగిన తర్వాత మీరు గుంటూరులోని....
సీఐడీ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది..?
పోలీసుల ప్రశ్నల వర్షం.. దాటేసిన సునీల్ నాయక్
గుంటూరు, మార్చి 8(ఆంధ్రజ్యోతి): ‘రఘురామరాజుపై మీ ఫిర్యాదు ఆధారంగానే దేశద్రోహం కేసు నమోదు చేశారు.. హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.. కేసు నమోదు, అరెస్టు జరిగిన తర్వాత మీరు గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? ఎవరైనా వెళ్లాలని చెప్పారా? నిజాలు ఎందుకు దాస్తున్నారు’ అని పోలీసులు నాటి సీఐడీ డీఐజీ సునీల్‌కుమార్ నాయక్‌ను ప్రశ్నించారు. ఆయన ఎంపీ, వీఐపీ కూడా కావడంతో పర్యవేక్షణ కోసం తనంతట తాను వెళ్లానని నిందితుడైన బిహార్ హోంగార్డులు/ఫైర్ విభాగం ఐజీ నాయక్ (ఏ-7) చెప్పినట్లు తెలిసింది. పలు ప్రశ్నలకు దాటవేత ధోరణిలో జవాబులిచ్చినట్లు సమాచారం. రఘురామను కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసు విచారణలో భాగంగా పోలీసులు ఆయన్ను వరుసగా నాలుగో రోజు ఆదివారం విచారించారు. దర్యాప్తు అధికారి, విజయనగరం ఎస్పీ దామోదర్ సుదీర్ఘంగా ప్రశ్నించారు. దర్యాప్తునకు ఏ మాత్రం సహకరించడం లేదని తెలిసింది. ‘మీరు సీఐడీ కార్యాలయానికి వెళ్లిన తర్వాత నిఘా సిబ్బందిని అక్కడి నుంచి ఎందుకు పంపారు.. మీ అవసరం లేకపోయినా ఎందుకు సీఐడీ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చింది.. ఈ కుట్ర వెనుక ఎవరున్నారు?’ వంటి ప్రశ్నలకు నాయక్ సూటిగా సమాధానం చెప్పలేదని తెలిసింది. సోమవారం కూడా విచారణకు హాజరు కావాలని ఎస్పీ ఆయనకు సూచించారు. మరోవైపు ఆయన్ను అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి.