ఎట్టకేలకు పోలీసుల ముందుకు సునీల్ నాయక్
ABN , Publish Date - Mar 06 , 2026 | 05:03 AM
నాటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై కస్టడీలో చిత్రహింసల కేసులో నిందితుడైన బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్ నాయక్ (ఏ-7)..
ఏపీ హైకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరు
గుంటూరు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): నాటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై కస్టడీలో చిత్రహింసల కేసులో నిందితుడైన బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్ నాయక్ (ఏ-7) ఎట్టకేలకు దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారు. ఏపీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. గురువారం ఉదయం 9.55 గంటలకు ఆయన గుంటూరులోని సీసీఎస్ పోలీసు స్టేషన్‌లో కేసు దర్యాప్తు అధికారి, విజయనగరం ఎస్పీ దామోదర్ ఎదుట హాజరయ్యారు. ఆయనతో న్యాయవాదులు కూడా లోనికి రావడానికి యత్నించగా పోలీసులు అనుమతించలేదు. నాయక్‌ను ఎస్పీ దామోదర్ ఒక్కరే ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుదీర్ఘంగా ఏడు గంటలపాటు ప్రశ్నించారు. మధ్యాహ్నం గంటపాటు భోజన విరామం ఇచ్చారు. తొలి రోజు విచారణలో.. రఘురామకృష్ణరాజును ఎందుకు అరెస్టు చేశారు.. ఆ కేసు విచారణలో మీ పాత్ర ఏమిటి.. ఆ రోజు అక్కడ ఏం జరిగింది..? ఎవరెవరు ఉన్నారు.. వంటి ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. శుక్రవారం కూడా రావాలని ఎస్పీ ఆయనకు సూచించారు. 3-4 రోజులు ఆయన్ను ప్రశ్నించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.