సునీల్ నాయక్ అరెస్టులో హైడ్రామా
ABN , Publish Date - Feb 24 , 2026 | 03:18 AM
నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది.
రఘురామ టార్చర్ కేసులో పట్నాలో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
కోర్టు ట్రాన్సిట్ వారెంటు ఇవ్వకపోవడంతో కొద్ది గంటల్లోనే విడుదల
ఎస్పీ దామోదర్ నేతృత్వంలో ఉదయాన్నే ఆయన ఇంటికి పోలీసు బృందం
అరెస్టు చేస్తున్నట్లు తల్లికి నోటీసులు.. తీసుకెళ్లకుండా అడ్డుకున్న హోంగార్డులు
దామోదర్ బృందంపై ఓ సీనియర్ ఐపీఎస్ దుర్భాషలు
స్థానిక పోలీసుల సాయంతో నాయక్‌కు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు
ట్రాన్సిట్ వారెంటు కోసం అక్కడి కోర్టుకు.. జారీకి న్యాయాధికారి నిరాకరణ
30 రోజుల వరకు చర్యలొద్దని ఆదేశం.. నాయక్‌ను తమతో తీసుకెళ్లిపోయిన బిహార్ పోలీసులు.. పట్నా హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఏపీ పోలీసులు!
కేసు : రఘురామకృష్ణరాజు టార్చర్ వ్యవహారం
అరెస్టు జరిగింది : పట్నాలో.. చేసింది : ఏపీ పోలీసులు
సీన్ : సీనియర్ ఐపీఎస్, బిహార్ పోలీసుల హల్‌చల్
గుంటూరు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన (ఏ-6) నాటి సీఐడీ డీఐజీ, ప్రస్తుతం బిహార్ అగ్నిమాపక, హోంగార్డుల విభాగం ఐజీగా ఉన్న సునీల్ కుమార్ నాయక్‌ను ఏపీ పోలీసులు సోమవారం అరెస్టు చేయగా.. కొద్ది గంటల్లోనే ఆయన్ను వదిలేయాల్సి వచ్చింది. ఆయన్ను ఏపీ తరలించడానికి స్థానిక కోర్టు ట్రాన్సిట్ వారెంటు ఇవ్వకపోవడమే దీనికి కారణం. చిత్రహింసల కేసులో ఆయన్ను అరెస్టు చేసేందుకు దర్యాప్తు అధికారి, విజయనగరం ఎస్పీ దామోదర్ నేతృత్వంలో గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ రమణకుమార్, వెస్ట్ డీఎస్పీ అరవింద్, నగరంపాలెం సీఐ సత్యనారాయణ, మరో ఇరువురు సిబ్బంది ఆదివారమే పట్నా చేరుకున్నారు. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో నేరుగా సునీల్ నాయక్ ఇంటికి వెళ్లారు. రఘురామరాజును టార్చర్‌కు గురిచేసిన సంఘటన సంబంధించి నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో అరెస్టు చేస్తున్నట్లు చెబుతూ ఆయన తల్లికి నోటీసులు అందజేశారు. ఆయన్ను తీసుకెళ్తుండగా.. హోంగార్డు విభాగానికి చెందిన సిబ్బంది నానా రచ్చ చేసి అడ్డుకున్నారు.

ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిణి వచ్చి దామోదర్ బృందాన్ని తీవ్రస్థాయిలో దూషించినట్లు తెలిసింది. పట్నా (వెస్ట్) ఎస్పీ భానుప్రతాప్ సింగ్ వారిని శాంతింపజేశారు. ఆ తర్వాత ఏపీ పోలీసులు స్థానిక పోలీసుల సాయంతో సునీల్ నాయక్‌కు స్థానిక ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. కోర్టులో ట్రాన్సిట్ వారెంటు తీసుకుని సాయంత్రానికి విమానంలో ఏపీకి తీసుకొచ్చేందుకు టికెట్లు కూడా కొన్నారు. కానీ పట్నా 9వ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ట్రాన్సిట్ వారెంటు జారీకి నిరాకరించింది. అంతర్రాష్ట్ర అరెస్టు విధానాలను పాటించలేదని.. అరెస్టు వారెంటు లేదని.. అవసరమైన పత్రాలు సమర్పించకపోవడం వంటి కారణాలను న్యాయాధికారి ప్రస్తావించి.. ట్రాన్సిట్ వారెంటును తిరస్కరించినట్లు తెలిసింది. ఎఫ్‌ఐఆర్లో పేరు లేకుండా.. వారెంటు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని మేజిస్ట్రేట్ ప్రశ్నించగా.. ఏపీ పోలీసులు ఈ కేసులో సునీల్ నాయక్ పాత్రకు సంబంధించిన ఆధారాలు.. సాక్షులు, ఇతర నిందితుల నుంచి తీసుకున్న 161, 164 వాంగ్మూలాలు, సుమారు వెయ్యి పేజీల సీడీ ఫైలును కోర్టుకు చూపారు. వాటన్నింటినీ పరిశీలించాక.. ఈ కేసు దర్యాప్తు అధికారి దామోదర్ నియామక పత్రాన్ని మేజిస్ట్రేట్ అడిగారు. దీంతో ఆయన నియామక పత్రాన్ని చూపారు. అక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు ఎస్పీ దామోదర్ ప్రాసిక్యూషన్స్ జాయింట్ డైరెక్టర్ వీరగంధం రాజేంద్రప్రసాద్ దృష్టికి తీసుకొచ్చారు. సునీల్ నాయక్‌కు కోర్టు తప్పనిసరిగా ట్రాన్సిట్ వారంట్ ఇచ్చి తీరాల్సిందేనని పేర్కొంటూ.. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మూడు తీర్పులను రాజేంద్రప్రసాద్ వారికి పంపారు. అయినా లాభం లేకపోయింది. ట్రాన్సిట్ వారెంటు ఇవ్వడానికి మేజిస్ట్రేట్ నిరాకరించారు. అంతేగాక నెలరోజుల వరకు సునీల్ నాయక్‌పై చర్యలు తీసుకోకుండా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఈలోగా ఐదారు వందల మంది బిహార్ పోలీసులు కోర్టుకు చేరుకుని పరిసరాల్లో మోహరించారు. ఏపీ పోలీసుల అదుపులో ఉన్న నాయక్‌ను తీసుకెళ్లారు. కోర్టు ట్రాన్సిట్ వారంట్ ఇవ్వనందున ఆయన్ను తీసుకెళ్తున్నట్లు అదనపు డీజీ స్థాయి అధికారి ఒకరు తెలిపారు.
ఏపీ పోలీసులపై నాయక్ ఫిర్యాదు..
ఆ తర్వాత ఏపీ పోలీసులపై సునీల్ నాయక్ స్థానిక శాస్త్రినగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులు అరెస్టు వారెంటు చూపలేదన్నారు. అంతర్రాష్ట్ర అరెస్టుకు ముందు స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలన్న నిబంధనను పాటించలేదని.. అరెస్టు తర్వాతే శాస్త్రి నగర్ పోలీసు స్టేషన్‌కు తెలియజేశారని తెలిపారు. వారి చర్యలతో 66 ఏళ్ల తన తల్లి ఎం.భీకీబాయి తీవ్ర ఆందోళన చెందారని.. ఆమె గది తలుపులకు తాళం కూడా వేశారని ఆరోపించారు.
ఇదీ కేసు..
హైదరాబాద్‌లో జన్మదినం జరుపుకొంటున్న రఘురామరాజును సీఐడీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అదుపులోకి తీసుకుని 2021 మే 14న గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఆ రోజు రాత్రి ఆయన్ను కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆయన అరికాళ్లు వాచిపోయేలా రబ్బర్ బెల్టు, ఫైబర్ లాఠీతో విచక్షణరహితంగా కొట్టారు. ఈ వ్యవహారం స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్లడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 జూలై 11న నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో రఘురామరాజు ఫిర్యాదు చేశారు. పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేశారు. ఏ-1గా నాటి సీఐడీ డీజీ పీవీ సునీల్‌కుమార్, ఏ-2గా నాటి నిఘా చీఫ్ పీఎ్‌సఆర్ ఆంజనేయులు, ఏ-3గా మాజీ సీఎం జగన్, ఏ-4గా నాటి సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్, ఏ-5గా అప్పటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌ప్రభావతిని చేర్చారు. ఆ తర్వాత తనను టార్చర్‌కు గురిచేసిన గదిలో అప్పటి సీఐడీ డీఐజీ సునీల్‌నాయక్ కూడా ఉన్నట్లు రఘురామ ఆరోపించారు. దీనిపై విచారించిన అధికారులు ఆరోజు ఘటనా స్థలంలో నాయక్ ఉన్నట్లు నిర్ధారించుకుని ఆయన్ను ఏ-6గా చేర్చారు. వాస్తవానికి సునీల్ నాయక్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం లాలిపురం తండాకు చెందినవారు. 2005లో బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. జగన్ హయాంలో ఏపీ కేడర్‌కు డిప్యుటేషన్‌పై వచ్చారు. 2024లో కూటమి ప్రభుత్వం రాగానే బిహార్ వెళ్లిపోయారు. అక్కడ ఆయనకు ఐజీగా ఉద్యోగోన్నతి లభించింది. రఘురామ కేసులో తనను అరెస్టు చేస్తారని భావించి పట్నా హైకోర్టును ఆశ్రయించారు.
ఆయన్ను అరెస్టు చేయొద్దని హైకోర్టు అదేశాలిచ్చింది. దీనిపై రఘురామరాజు తరఫున ఏపీ ప్రాసిక్యూషన్స్ జాయింట్ డైరెక్టర్ వీరగంధం రాజేంద్రప్రసాద్ అప్పీలు దాఖలు చేశారు. దీంతో అరెస్టు నుంచి కల్పించిన రక్షణను హైకోర్టు కొట్టివేసింది. వెంటనే ఏపీలోని సంబంధిత కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. అయితే ఆయన గుంటూరులోని రెండో అదనపు జిల్లా జడ్జి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. కోర్టు దానిని కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో విచారణకు రావాలని ఏపీ పోలీసులు సునీల్ నాయక్‌కు నోటీసులు పంపారు. ఎన్నిసార్లు నోటీసులు పంపినా ఆయన స్పందించలేదు. దీంతో నేరుగా పట్నా వెళ్లి నోటీసులు అందించారు. అయినప్పటికీ ఆయన రాకపోవడంతో ఎస్పీ దామోదర్ బృందమే అక్కడకు వెళ్లింది.