Visakhapatnam: సీఐటీయూ అఖిల భారత అధ్యక్షుడిగా సుదీప్‌దత్తా
ABN , Publish Date - Jan 05 , 2026 | 04:24 AM
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) అఖిల భారత అధ్యక్షుడిగా సుదీప్ దత్తా, ప్రధాన కార్యదర్శిగా ఎలమరం కరీం ఎన్నికయ్యారు.
425 మందితో జాతీయ కార్యవర్గం ఎన్నిక
విశాఖపట్నం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) అఖిల భారత అధ్యక్షుడిగా సుదీప్ దత్తా, ప్రధాన కార్యదర్శిగా ఎలమరం కరీం ఎన్నికయ్యారు. విశాఖలో గత నెల 30న ప్రారంభమైన సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా 425 మందితో నూతన జాతీయ కార్యవర్గాన్ని, 125 మందితో వర్కింగ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడిగా సుదీప్ దత్తా, ప్రధాన కార్యదర్శిగా ఎలమరం కరీం, కోశాధికారిగా ఎం.సాయిబాబు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్‌గా ఏఆర్ సింధు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా తపన్ సేన్, కె.హేమలత సహా 13 మంది, కార్యదర్శులుగా స్వదేశ్ దేవరాయ్, కశ్మీర్ సింగ్ ఠాకూర్, జి.సుకుమారన్ సహా 23 మంది ఎన్నికయ్యారు. శాశ్వత ఆహ్వానితులుగా ఏకే పద్మనాభన్, మాణిక్ డే, ఏవీ నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి సీహెచ్ నరసింగరావు, జి.బేబీరాణి, ఏవీ నాగేశ్వరరావు, ఎం.సాయిబాబు, చుక్కా రాములకు చోటు దక్కింది.