Share News

‘సడన్‌’గా ఆగిన ప్రాణాలు!

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:24 AM

వేగంగా వెళ్తున్న లారీని డ్రైవర్‌ సడన్‌గా ఆపేయడంతో.. వెనుక వస్తున్న ఆటో దాన్ని ఢీకొన్న ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

‘సడన్‌’గా ఆగిన ప్రాణాలు!

  • లారీని అకస్మాత్తుగా ఆపేయడంతో ఢీకొన్న ఆటో

  • నలుగురి దుర్మరణం.. ఏడుగురికి గాయాలు

  • తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఘటన

పాకాల, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): వేగంగా వెళ్తున్న లారీని డ్రైవర్‌ సడన్‌గా ఆపేయడంతో.. వెనుక వస్తున్న ఆటో దాన్ని ఢీకొన్న ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి జిల్లా పాకాల మండలం గాదంకి ఫారెస్ట్‌ చెక్‌పోస్ట్‌ సమీపంలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి శ్రీకాళహస్తి సమీపంలోని కట్టెల ఫ్యాక్టరీకి టింబర్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ ఫారెస్ట్‌ చెక్‌పోస్ట్‌ సమీపంలో వేగంగా వెళ్తూ సడన్‌గా ఆగింది. ఎలాంటి సిగ్నల్‌, ఇండికేటర్‌ వేయకుండా డ్రైవర్‌ సడన్‌గా బ్రేక్‌ వేయడంతో వెనుకే వస్తున్న ఆటో అదుపుచేయలేక బలంగా ఢీకొట్టింది. చిత్తూరు జిల్లా యాదమరి మండలం పెరుమాలపల్లె, చిత్తూరు రూరల్‌ మండలం ఏనుగుంటపల్లెకు చెందిన 11 మంది ఈ ఆటోలో ఉండగా, అందులోని ఏనుగుంటపల్లెకు చెందిన యనమల మాధవి(40), ఆమె కుమార్తె మేఘన(15) అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన పెరుమాలపల్లెకు చెందిన పులకింటి రాజశేఖర్‌(25)ను తిరుపతి రుయాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పెరుమాలపల్లెకే చెందిన పి.బేబీ(50) రుయాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడ్డవారిని నేషనల్‌ హైవే సిబ్బంది తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. చెక్‌ పోస్ట్‌ సిబ్బంది విజిల్‌ వేయగా.. వేగంగా వెళ్తున్న లారీ సడన్‌బ్రేక్‌ వేయడంతో వెనుక వస్తున్న ఆటో ఢీకొన్నట్లు సమాచారం. పాకాల సీఐ చిన్నగోవిందు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 25 , 2026 | 03:24 AM