Share News

ఉద్దానం మరో అడుగు!

ABN , Publish Date - Mar 14 , 2026 | 06:22 AM

కిడ్నీ వ్యాధుల చికిత్సలో ఉద్దానం మరో అడుగు వేసింది. పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో తొలిసారిగా నిర్వహించిన మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతమైంది.

ఉద్దానం మరో అడుగు!

  • కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ సక్సెస్‌

  • పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో

  • 5 గంటలపాటు శ్రమించిన వైద్యబృందం

  • దాత-బాధితురాలు ఇద్దరూ క్షేమం

  • కుమార్తెకు తన కిడ్నీ ఇచ్చిన తండ్రి

పలాస, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): కిడ్నీ వ్యాధుల చికిత్సలో ఉద్దానం మరో అడుగు వేసింది. పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో తొలిసారిగా నిర్వహించిన మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతమైంది. శుక్రవారం 5 గంటల పాటు వైద్య బృందం శ్రమించి ఈ ఆపరేషన్‌ నిర్వహించింది. దాత- బాధితురాలు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని ప్రకటించింది. మరికొన్ని ఆపరేషన్లు ఇక్కడ చేయడానికి ఇది మొదటి అడుగని వైద్య బృందానికి నేతృత్వం వహించిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ రవిరాజ్‌ తెలిపారు. వైద్య బృందానికి ఉద్దానం ప్రజల తరఫున ఎమ్మెల్యే గౌతు శిరీష ధన్యవాదాలు తెలిపారు. చికిత్స అనంతరం బాధితురాలు హేమశ్రీ(27) ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీశారు. సోంపేటకు చెందిన హేమశ్రీకి రెండు కిడ్నీలూ పాడయ్యాయి. ఆమెకు మూడు నెలలుగా డయాలసిస్‌ చేస్తున్నారు. తండ్రి మోహనరావు ఆమెకు తన కిడ్నీ ఒకటి దానం ఇవ్వడానికి ముందు కొచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమెకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆమెకు అమర్చిన కిడ్నీ పనితీరు సంతృప్తికరంగా ఉందని వైద్యులు తెలిపారు.


వైద్య బృందం ఇదే...

ఉమామహేశ్వరరావు (కిమ్స్‌ వైద్యాలయం), పూర్ణచంద్రరావు, వివేక్‌నందా, జోగినాయుడు, రవిరాజ్‌, నెఫ్రాలజిస్ట్‌ (విశాఖపట్నం), జె.కిషోర్‌ (సూపరింటెండెంట్‌, కిడ్నీ ఆస్పత్రి, పలాస)

పలాసలో ఇదే ప్రథమం..

‘‘మూత్రపిండాల ఆపరేషన్లు విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఇప్పటి వరకూ జరిగాయి. ఎటువంటి బోధనా ఆసుపత్రులు లేని పలాసలో జరగడం దేశంలోనే ఇది ప్రథమం. కిమ్స్‌, జెమ్స్‌ వైద్య నిపుణులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉచితంగా ఆపరేషన్‌ నిర్వహించారు.’’

-డాక్టర్ రవిరాజ్‌, నెఫ్రాలజిస్ట్‌

Updated Date - Mar 14 , 2026 | 06:23 AM