Share News

ఏకసభ్య కమిటీపై సుప్రీంకు స్వామి!

ABN , Publish Date - Feb 23 , 2026 | 04:02 AM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టు ముందుకు రానుంది.

ఏకసభ్య కమిటీపై సుప్రీంకు స్వామి!

  • నేడు విచారించనున్న సీజేఐ ధర్మాసనం

  • కోర్టు ముందుకు మరోసారి తిరుమల లడ్డూ వ్యవహారం

  • నేడు విచారించనున్న సీజేఐ ధర్మాసనం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టు ముందుకు రానుంది. సీబీఐ సారథ్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఇచ్చిన నివేదికపై రాష్ట్రప్రభుత్వం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దినేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించడంపై బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యం స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఈ నెల 11న ఆయన రిట్‌ పిటిషన్‌ (సివిల్‌ 234/2026) వేశారు. ప్రతివాదుల జాబితాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు, సిట్‌, సీబీఐ, టీటీడీలను చేర్చారు. ఈ వ్యాజ్యం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనం ఎదుట సోమవారం విచారణకు రానుంది. జగన్‌ హయాంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించారనే అభియోగాలపై సమగ్ర విచారణకు సీబీఐ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నెయ్యి కల్తీ ఆరోపణలు వాస్తవమేనని సిట్‌ నెల్లూరు ఏసీబీ కోర్టులో చార్జిషీటు దాఖలుచేసింది. నెయ్యి టెండర్ల పర్యవేక్షణ, నిబంధనల సడలింపులో లోపాలు, వైఫల్యాలతోనే కల్తీ జరిగిందని రాష్ట్రప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పించింది. ఈ క్రమంలో ఆ నివేదికను పరిశీలించి ఎవరెవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజేస్తూ ప్రభుత్వం ఇటీవల రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దినేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Updated Date - Feb 23 , 2026 | 04:05 AM