Share News

డోర్‌ డెలివరీతో పాటు..డబ్బులూ ఇచ్చారు!

ABN , Publish Date - May 21 , 2026 | 04:27 AM

తమ కుమారుడి శవాన్ని కారులో తీసుకువచ్చి ఇంటి వద్ద వదిలేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. తమకు కొంత సొమ్ము ఇచ్చారని సుబ్రహ్మణ్యం తల్లి వీధి నూకరత్నం తెలిపారు.

డోర్‌ డెలివరీతో పాటు..డబ్బులూ ఇచ్చారు!

  • వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆయన తల్లి నూకరత్నం వాంగ్మూలం

రాజమహేంద్రవరం, మే 20(ఆంధ్రజ్యోతి): తమ కుమారుడి శవాన్ని కారులో తీసుకువచ్చి ఇంటి వద్ద వదిలేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. తమకు కొంత సొమ్ము ఇచ్చారని సుబ్రహ్మణ్యం తల్లి వీధి నూకరత్నం తెలిపారు. తమను బాగా చూసుకుంటానని హామీ కూడా ఇచ్చారన్నారు. ఏదో ప్రమాదం జరిగిందని.. దీంతో సుబ్రహ్మణ్యం చనిపోయాడని చెప్పినట్టు వెల్లడించారు. అయితే.. ఆయన మాటలపై తమకు అనుమానం వచ్చిందని, ఇంతలో చుట్టుపక్కల వాళ్లు పోగయ్యే సరికి అనంతబాబు బైక్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయారని వెల్లడించారు. బుధవారం రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టులో సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ ప్రారంభమైంది. ప్రధాన సాక్షిగా ఉన్న మృతుడి తల్లి నూకరత్నం హాజరై.. వాంగ్మూలం ఇచ్చారు. అదేవిధంగా లాయర్లు చేసిన క్రాస్‌ఎగ్జామినేషన్‌కు కూడా ఆమె సమాధానమిచ్చారు. తొలుత ఆమెను సుమారు గంటపాటు ప్రాసిక్యూషన్‌ తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ముప్పాళ్ల సుబ్బారావు చీఫ్‌ ఎగ్జామిన్‌ చేశారు. తర్వాత అనంతబాబు తరఫున విశాఖపట్నం నుంచి వచ్చిన ముగ్గురు లాయర్లు సుదీర్ఘంగా 4 గంటలకుపైగా ప్రశ్నించారు. నూకరత్నాన్ని అయోమయానికి గురిచేసే విధంగా ప్రశ్నలు అడగడంతో ఆమె పలుమార్లు భయపడ్డారు. క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో ‘చంద్రబాబు తెలుసా?’ అని నూకరత్నాన్ని అనంతబాబు తరఫు లాయర్లు ప్రశ్నించగా.. తనకు తెలియదని ఆమె చెప్పారు. మీకు డబ్బులు ఇచ్చారు కదా అన్నప్పుడు.. అవునన్నారు. టీడీపీ వాళ్లు వచ్చి ఏమైనా చెప్పారా? అన్న ప్రశ్నకు లేదని జవాబిచ్చారు. తొలిరోజు విచారణకు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణతోపాటు రిమాండు ఖైదీగా ఉన్న అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీ దుర్గ కోర్టుకు హాజరయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయాధికారి సునీత గంధం ఆధ్వర్యంలో విచారణ జరిగింది. కాగా, కోర్టులో అనంతబాబును చూసేందుకు వైసీపీ కార్యకర్తలు ఎగబడ్డారు. పోలీసుల జోక్యంతో బయటకు వెళ్లారు.

Updated Date - May 21 , 2026 | 04:27 AM