ఐకానిక్ భవనాలపై సబ్‌కమిటీ తొలి సమావేశం
ABN , Publish Date - Feb 21 , 2026 | 05:11 AM
అమరావతి రాజధానిలో ఐకానిక్ భవనాల నిర్మాణం, పార్కింగ్ సదుపాయాలు వంటి అంశాలతో పాటు రాష్ట్ర స్థాయి ఉద్యోగులు ఎంత మంది ఉన్నారనే దానిపై మంత్రివర్గ ఉపసంఘం చర్చంచినట్లు మంత్రి నారాయణ తెలిపారు.
శాఖల వారీగా ఉద్యోగుల వివరాలు, అవసరమైన స్థలం,సదుపాయాలపై చర్చించాలంటూ అధికారులకు ఆదేశం
కచ్చితమైన వివరాలకు ప్రతి శాఖ నుంచి ఒకరిని నామినేట్ చేయాలని సీఎ్‌సను కోరతాం: మంత్రి నారాయణ
అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిలో ఐకానిక్ భవనాల నిర్మాణం, పార్కింగ్ సదుపాయాలు వంటి అంశాలతో పాటు రాష్ట్ర స్థాయి ఉద్యోగులు ఎంత మంది ఉన్నారనే దానిపై మంత్రివర్గ ఉపసంఘం చర్చంచినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సచివాలయంలో ఏ శాఖకు ఎంత స్థలం అవసరమవుతుంది అనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం మొదటసారి సమావేశమైంది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, బాలవీరాంజనేయస్వామి, బీసీ జనార్దన్‌రెడ్డి, సత్యకుమార్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ‘శాఖల వారీగా ఉద్యోగుల వివరాలు, వారికి కావాల్సిన స్థలం, సదుపాయాలపై చర్చించాలని అధికారులను ఆదేశించాం. 2014-19 మధ్యలో 52.72 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో భవనాలు డిజైన్ చేశాం. దానిలో కార్పెట్ ఏరియా 31.71 లక్షల చ.అడుగులు. ఆ కాలంలో 26,700 మంది ఉద్యోగులు ఉన్నారన్న సమాచారం మేరకు డిజైన్ చేశాం. అయితే ప్రస్తుతం ఉన్న అవసరాలపై పూర్తిగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు కేబినెట్ సబ్‌కమిటీని నియమించారు. తాజా సమాచారం ప్రకారం మొత్తం 39,882 మంజూరైన పోస్టులున్నాయి. అయితే కచ్చితమైన లెక్కల కోసం ప్రతి డిపార్ట్‌మెంట్ నుంచి ఒకరిని నామినేట్ చేయాలని సీఎస్‌ను కోరుతాం.
మరో వైపు ఇటీవల కొత్తగా నిర్మించిన నయారాయపూర్, హైదరాబాద్‌లోని సచివాలయాలను కూడా పరిశీలించాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. వచ్చే సోమవారం మరోసారి సబ్‌కమిటీ సమావేశమై ఆయా అంశాలపై చర్చిస్తుంది. రాజధానిలో సాధారణ పరిపాలనశాఖ టవర్‌తో పాటు నాలుగు హెచ్‌ఓడీ టవర్లను ప్రభుత్వం నిరిస్తుంది. ఈ టవర్లను ఐకానిక్ భవనాలుగా నిర్మించేలా ప్రభుత్వం డిజైన్లు రూపొందించింది. ఇప్పటికే పనులు కూడా ప్రారంభమయ్యాయి. గతంలో సెక్రటేరియట్‌లో కేవలం ముఖ్యకార్యదర్శులతో పాటు ఆయా శాఖలకు చెందిన సెక్షన్లు మాత్రమే ఉండేవి. కానీ కొత్తగా నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల్లో సెక్రటేరియట్ విభాగాలతో పాటు శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్ కార్యాలయాలు కూడా ఒకే చోట ఉండేలా నిర్మాణం చేస్తున్నారు’ అని మంత్రి నారాయణ వివరించారు.