అసెంబ్లీలో విద్యార్థుల సందడి
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:22 AM
రాష్ట్ర శాసనసభలో గురువారం విద్యార్థులు సందడి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు 150 మంది అసెంబ్లీ సమావేశాలను వీక్షించారు.
అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభలో గురువారం విద్యార్థులు సందడి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు 150 మంది అసెంబ్లీ సమావేశాలను వీక్షించారు. తమకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ప్రభుత్వం ఈ అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. సభ జరిగే తీరు, ప్రజాప్రతినిధుల చర్చలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గమనించారు. సభ విరామ సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విద్యార్థులను కలిసి మాట్లాడారు. విద్యార్థులతో కలిసి గ్రూపు ఫొటోలు దిగారు. శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూడడం తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని విద్యార్థులు అన్నారు. ఈ అరుదైన అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

చాలా ఆనందంగా ఉంది..
అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించిన స్పీకర్‌కు ధన్యవాదాలు. సమావేశాలను ప్రత్యక్షంగా చూడటం చాలా ఆనందంగా ఉంది. సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంటుంది. ప్రత్యక్షంగా వచ్చి చూసే అవకాశం రాజకీయ నాయకులకు మాత్రమే ఉంటుంది. కానీ ఇంత చిన్న వయస్సులో నాకు ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించడం ఆనందంగా ఉంది. మా స్కూల్‌లో మాక్ అసెంబ్లీ పెట్టుకున్నాం. అక్కడ ప్రశ్నలు చాలా ఆర్టిఫీషియల్‌గా ఉన్నాయి. సభలో చూస్తే ప్రశ్నలు చాలా జనరల్‌గా అడిగేస్తున్నారు. స్పీకర్ కూడా చాలా ఓర్పుగా సమయం అయిపోయినా సభ్యులకు అవకాశం ఇస్తున్నారు.
- ఎస్.అప్సానా, నారాయణ స్కూల్, వేంపల్లె, కడప జిల్లా.

సమావేశాలను ప్రత్యక్షంగా చూస్తాననుకోలేదు
జీవితంలో ఎప్పుడూ అసెంబ్లీకి వెళ్లి.. కార్యకలాపాలు చూస్తాననుకోలేదు. ఇప్పుడు సమావేశాలను ప్రత్యక్షంగా చూడడం ఆనందంగా ఉంది. సమావేశాలు చూసిన తర్వాత సమాజంలో ఎలా మెలగాలో తెలుసుకున్నాను. సభలో మాట్లాడే అంశాలు ఆలోచింపజేశాయి.
- శ్రీసంధ్యన

ఆ అనుభూతి మాటల్లో చెప్పలేకపోతున్నా..
అసెంబ్లీకి వచ్చి సమావేశాలను ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నాను. అసెంబ్లీని చూసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు.
- నాగ తమోజ్ఞ

సభ ప్రశాంతంగా జరిగింది..
విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇంత మంచి అవకాశం కల్పించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు. సభలో చాలామంది సభ్యు లు ప్రశ్నలు లేవనెత్తారు. వాటికి మంత్రులు చాలా ప్రశాంతంగా సమాధానాలు ఇచ్చారు. విద్యార్థులు వీటిని చూసి చాలా నేర్చుకున్నారు. అక్కడ ఏమైనా గొడవలు జరుగుతాయోమో అనుకున్నాం. కానీ సభ చాలా ప్రశాంతంగా జరిగింది.
- జాస్మిన్, ఉపాధ్యాయురాలు

కలలో కూడా అనుకోలేదు..
అసెంబ్లీ సమావేశాలను నేరు గా చూసే అవకాశం వస్తుందని కల లో కూడా అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. అసెంబ్లీ సమావేశాలను ఎప్పుడు ఫోన్లో చూసినా గొడవలు, అరుచుకోవడమే కనిపిస్తాయి. కానీ సభను నేరుగా చూస్తే చాలా ప్రశాంతంగా, చక్కగా జరిగింది.
- జయదుర,్గ ఏజీ అండ్‌ఎస్‌జీఎస్
డిగ్రీ కాలేజి, ఉయ్యూరు