విద్యార్థులకు నైతిక విలువలు నేర్పాలి
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:47 AM
ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు.
గురుపూజోత్సవంలో ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచన
చిత్తూరు సెంట్రల్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. విద్యార్థులకు నైతిక విలువలు నేర్పిస్తే, ఆ టీచర్‌ను వారు ఎన్నటికీ మర్చిపోరన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శనివారం చిత్తూరులోని జడ్పీ సమావేశ మందిరంలో విద్యాశాఖ-సమగ్రశిక్ష సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన గురుపూజోత్సవంలో ఆయన మాట్లాడారు. ఉత్తమ అవార్డులకు ఎంపికైన 72 మంది టీచర్లు జిల్లాలోని 10 వేల మంది టీచర్లకు ప్రతినిధులన్నారు. ‘సమాజంలో నడుచుకొనే విధానం.. తల్లిదండ్రులను గౌరవించడం విద్యార్థులకు నేర్పిస్తే.. ఆ ఉపాధ్యాయుడు వారికి గుర్తుండిపోతారు. మా టీచర్లు నాపై ప్రత్యేక శ్రద్ధచూపి చదువుచెబుతున్నారనే విషయాలను విద్యార్థులు ఇళ్లకు వెళ్లాక తల్లిదండ్రులకు చెప్పేలా ఉండాలి’ అని తెలిపారు. విద్యార్థులు సరైన మార్గంలో నడవడానికి టీచర్ల బోధన ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. ఐఐటీ చదవి విలువలు లేకుంటే వ్యర్థమేనన్నారు. గుర్తించాం కాబట్టి సత్కరిస్తున్నామే తప్ప, ఉపాధ్యాయులైన వారంతా ఉత్తములేనని డీఈవో లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. త్వరలో ఏఐ ఆధారిత విద్యాబోధన వచ్చినా, ఉపాధ్యాయుల విలువలు తగ్గిపోవన్నారు. పలువురు టీచర్లు వారి సొంత డబ్బులు వెచ్చించి, విద్యార్థులకు చదువు చెబుతున్న వారి సేవలు అభినందనీయమని జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు పేర్కొన్నారు. విద్యారంగంలో కృషి, త్యాగంతోనే ఉత్తమ ఉపాధ్యాయుడు అవుతారని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ అన్నారు. డీవైఈవో ఇందిర, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ జయప్రకాష్, సూపరింటెండెంట్ స్వర్ణకుమారి, విద్యాశాఖ సిబ్బంది, అవార్డు గ్రహీతలు, టీచర్లు పాల్గొన్నారు. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు.