ఈ ‘భోజనం’ తినలేకపోతున్నాం సార్!
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:14 AM
‘ప్లీజ్ సార్.. మధ్యాహ్నం భోజనం తినలేకపోతున్నాం. అన్నం అసలేం బాగుండటం లేదు. మాకు ఆకలేస్తోంది. మంచి అన్నం పెట్టించండి సార్’ అంటూ.. పలువురు విద్యార్థులు...
పారేసి నిరసన తెలిపిన విద్యార్థులు
మంచి భోజనం పెట్టించాలని ఏఎస్ఐకి వినతి
మైలవరం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ‘ప్లీజ్ సార్.. మధ్యాహ్నం భోజనం తినలేకపోతున్నాం. అన్నం అసలేం బాగుండటం లేదు. మాకు ఆకలేస్తోంది. మంచి అన్నం పెట్టించండి సార్’ అంటూ.. పలువురు విద్యార్థులు ఆకలి మంటతో మైలవరం ఏఎస్ఐ సర్వేశ్వరరావుకు మొర పెట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారకరామానగర్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఈ పరిస్థితి ఎదురైంది. ఇక్కడ ఉడికీ ఉడకని అన్నంలో నిమ్మరసం గానీ, చింతపండు గానీ లేకుండా కేవలం పసుపు కలిపి పులిహోర అంటూ వడ్డించారు. కోడి గుడ్డు సరిగ్గా ఉడికించకపోవడంతో పచ్చి వాసన వచ్చింది. ఈ రెండు కలిపి మెనూలో మంగళవారం మధ్నాహ్నం భోజనం కింద పెట్టడంతో విద్యార్థులు వాసన భరించలేక ప్లేట్లతో బయటకు పరుగులు తీసి పారేశారు. ఈ విషయం తెలుసుకుని ఏఎ్‌సఐ పాఠశాలను సందర్శించగా, విద్యార్థులు ఆయన్ను చుట్టుముట్టారు. భోజనం బాగుండటం లేదని వాపోయారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ వారికి భరోసా ఇచ్చారు.
22 ఏళ్ల నుంచీ ఒకే వంట ఏజెన్సీ!
గత 22 ఏళ్లుగా మధ్యాహ్న భోజన నిర్వహణ ఒకే వంట ఏజెన్సీ నిర్వహకురాలి కింద ఉంది. కొన్ని నెలలుగా భోజనం నాణ్యత లేదన్న ఫిర్యాదులపై ఈనెల 6న తహసీల్దార్ అబ్దుల్ దరియా, ఎంపీడీవో పి.అనురాధ పాఠశాలను సందర్శించి ఆరా తీశారు. ఈ సందర్భంగా.. భోజనం విషయంలో అనేక పొరపాట్లు జరిగాయని, అవి పునరావృతంకానివ్వనని, ఉపాధ్యాయులతో మర్యాదగా నడుచుకుంటానని, మెనూ ప్రకారం వండాల్సిన పద్ధతిలో తాజా కూరగాయలతో వంట వండి పిల్లలకు వడ్డించగలనని, ఈ విషయాల్లో ఏం తేడా జరిగినా తనపై చర్యలు తీసుకోవచ్చని ఆమె వివరణ ఇస్తూ సంజాయిషీ లేఖ ఇచ్చింది. అయితే. ఈ లేఖ ఇచ్చిన నాలుగు రోజులకే విద్యార్థులు ఆమె వండిన అన్నం తినలేక బయట పారేయడం గమనార్హం.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం: ఎంఈవో
పిల్లలు మధ్యాహ్న భోజనం తినలేక పారేసిన విషయం మా దృష్టికి వచ్చింది. మధ్యాహ్న భోజన నిర్వహణను మరో మారు పరిశీలిస్తాం. ఇప్పటికే నిర్వాహకురాలిని హెచ్చరించాం. మళ్లీ ఇలాంటి పరిస్థితి పునరావృతమైతే చర్యలు తప్పవు.