Share News

విద్యార్థి నేతలపై దాడి.. కిడ్నాప్‌!

ABN , Publish Date - Feb 04 , 2026 | 06:22 AM

మోహన్‌బాబు యూనివర్సిటీ మరో వివాదంలో చిక్కుకుంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేసేందుకు వెళ్తున్న విద్యార్థి సంఘాల...

విద్యార్థి నేతలపై దాడి.. కిడ్నాప్‌!

  • మరో వివాదంలో మోహన్‌బాబు యూనివర్సిటీ

  • అధిక ఫీజులపై ధర్నాకు వెళ్తున్న వారిపై ఎంబీయూ బౌన్సర్ల దాడి.. ఇద్దరి కిడ్నాప్‌

  • గంటలోనే చేధించిన తిరుపతి జిల్లా పోలీసులు

  • అదుపులో కిడ్నాపర్లు.. విద్యార్థి నేతలు సురక్షితం

  • మోహన్‌బాబు, విష్ణు సహా 23 మందిపై కేసు

తిరుపతి/చంద్రగిరి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): మోహన్‌బాబు యూనివర్సిటీ మరో వివాదంలో చిక్కుకుంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేసేందుకు వెళ్తున్న విద్యార్థి సంఘాల నేతలపై వర్సిటీ బౌన్సర్లు దాడికి పాల్పడి, ఇద్దరిని కిడ్నాప్‌ చేయడం మంగళవారం తిరుపతిలో సంచలనం సృష్టించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. విద్యార్థి నేతలను కాపాడారు. నలుగురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో సూత్రధారులుగా భావిస్తున్న వర్సిటీ యజమానులైన మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణు, ఎంబీయూ పీఆర్వో సతీశ్‌కుమార్‌ సహా 23 మందిపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంబీయూలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ రెండ్రోజుల కిందట విద్యార్థి సంఘాల నేతలు గవర్నర్‌కు, విద్యా మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం తిరుపతి ఎన్టీఆర్‌ కూడలిలో ఎంబీయూ దిష్టిబొమ్మ దహనానికి ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్‌, ఎన్‌ఎ్‌సయూఐ సంఘాల నాయకులు ప్రయత్నించారు. పోలీస్‌ 30 యాక్ట్‌ అమల్లో ఉన్నందున వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా బైక్‌లపై కలెక్టరేట్‌ బయల్దేరారు. మధ్యలో 20 మంది బౌన్సర్లు మూడు ఇన్నోవా వాహనాల్లో వచ్చి అడ్డుకున్నారు. ఎస్‌ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్‌, ఎస్వీయూ క్యాంపస్‌ ఇన్‌చార్జి వినోద్‌లపై దాడి చేశారు. బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. మరో ఎస్‌ఎఫ్ఐ నాయకుడు రెడ్డికుమార్‌ తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీపీఐ, సీపీఎం, టీఎన్‌ఎస్ఎఫ్ నాయకులు కలెక్టర్‌, ఎస్పీలకు ఫిర్యాదు చేయడంతో పాటు తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. దాడి, కిడ్నాప్‌ ఘటనలను తీవ్రంగా పరిగణించిన జిల్లా పోలీసు యంత్రాంగం.. ఏఎస్పీ రవి మనోహరాచారి, డీఎస్పీ ప్రసాద్‌లను రంగంలోకి దించింది.


గంటా పదిహేను నిమిషాల్లోనే కిడ్నాపర్లకు చెక్‌ పెట్టారు. బి.కొంగరవారిపల్లె వద్ద వెళ్తుండగా పోలీసులు చేజ్‌ చేసి అడ్డుకుని, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి నేతలను సురక్షితంగా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అయితే తిరుపతి జిల్లా ఎస్‌ఎఫ్ఐ కార్యదర్శి అక్బర్‌, ఏఐఎస్ఎఫ్‌ కార్యదర్శి ప్రవీణ్‌లపై ఎంబీయూ పీఆర్వో సతీశ్‌ చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వర్సిటీ గురించి మాట్లాడకుండా ఉండేందుకు రూ.15 లక్షలు డిమాండ్‌ చేశారని, అది చెల్లించకపోవడంతో.. కలెక్టరేట వద్ద ధర్నా చేస్తామంటూ హెచ్చరించారని పేర్కొన్నారు.

బ్లాక్‌ లిస్టులో పెట్టాలి: ఎస్‌ఎఫ్ఐ

అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): మోహన్‌బాబు వర్సిటీని బ్లాక్‌ లిస్టులో పెట్టాలని ఎస్‌ఎఫ్ఐ డిమాండ్‌ చేసింది.

చర్యలు తీసుకోవాలి: సీపీఐ

మోహన్‌బాబు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 04 , 2026 | 06:22 AM