సాగునీటికి తంటాలు!
ABN , Publish Date - Feb 05 , 2026 | 12:31 AM
మూడు దశాబ్దాలుగా ఎన్టీఆర్ జిల్లా రైతులు సాగర్ జలాలకు దూరమవుతూ వస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆ కాస్త ఆశలూ సన్నగిల్లి సాగు చేయడం మానేశారు. పరిస్థితి ముందుగానే ఊహించిన డాక్టర్ కేఎల్ రావు తదుపరి చంద్రబాబు ప్రభుత్వంలో సాగర్‌కు ప్రత్యామ్నాయంగా కృష్ణానదిపై నిర్మించిన పథకాలూ పులిచింతల ప్రాజెక్ట్ నిబంధనలతో నీరందక నిలిచిపోయాయి. కళ్లెదుట నీరున్నా పంటలు పండించుకోలేని దైన్య స్థితిలో రైతులు అల్లాడిపోతున్నారు. పాలకులు, అధికారలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో తెలంగాణ అధికారులను ప్రాధేయపడుతూ నీటిని విడుదల చేయించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. హక్కుగా రావల్సిన నీటిని అడిగేందుకు కూడా ఎన్‌ఎస్‌పీ అధికారులకు తీరిక లేకుండా పోయింది. మరోవైపు మంత్రులు గానీ, శాసన సభ్యులు గానీ ఈ అంశంపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. గురువారం సీఎం చంద్రబాబు సమక్షంలో సాగునీటి రంగంపై జరుగుతున్న సమీక్షలో అవకాశం ఇస్తే తాము వెళ్లి తమ బాధను విన్నవించుకోవాలని సాగర్ ఆయకట్టు రైతులు ఆశిస్తున్నారు.
- మూడు దశాబ్దాలుగా సాగర్ జలాలకు దూరం
- విభజన తర్వాత పూర్తిగా ఆశలు వదులుకున్న ఎన్టీఆర్ జిల్లా రైతులు
- కృష్ణానదిపై నిర్మించిన పథకాలను వినియోగంలోకి తేవాలి
- నేడు సాగు నీటి సంఘాలతో సీఎం చంద్రబాబు సమావేశం
- జిల్లా నుంచి హాజరుకానున్న ప్రతినిధులు
- సమస్యలు విన్నవించి సాగునీటిని సాధించాలని రైతుల వేడుకోలు
మూడు దశాబ్దాలుగా ఎన్టీఆర్ జిల్లా రైతులు సాగర్ జలాలకు దూరమవుతూ వస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆ కాస్త ఆశలూ సన్నగిల్లి సాగు చేయడం మానేశారు. పరిస్థితి ముందుగానే ఊహించిన డాక్టర్ కేఎల్ రావు తదుపరి చంద్రబాబు ప్రభుత్వంలో సాగర్‌కు ప్రత్యామ్నాయంగా కృష్ణానదిపై నిర్మించిన పథకాలూ పులిచింతల ప్రాజెక్ట్ నిబంధనలతో నీరందక నిలిచిపోయాయి. కళ్లెదుట నీరున్నా పంటలు పండించుకోలేని దైన్య స్థితిలో రైతులు అల్లాడిపోతున్నారు. పాలకులు, అధికారలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో తెలంగాణ అధికారులను ప్రాధేయపడుతూ నీటిని విడుదల చేయించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. హక్కుగా రావల్సిన నీటిని అడిగేందుకు కూడా ఎన్‌ఎస్‌పీ అధికారులకు తీరిక లేకుండా పోయింది. మరోవైపు మంత్రులు గానీ, శాసన సభ్యులు గానీ ఈ అంశంపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. గురువారం సీఎం చంద్రబాబు సమక్షంలో సాగునీటి రంగంపై జరుగుతున్న సమీక్షలో అవకాశం ఇస్తే తాము వెళ్లి తమ బాధను విన్నవించుకోవాలని సాగర్ ఆయకట్టు రైతులు ఆశిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, నందిగామ):
నాగార్జున సాగర్ లాల్ బహదూర్ శాసి్త్ర ఎడమ కాల్వ కింద ఉన్న ఎన్టీఆర్ జిల్లా జోన్-2 పరిధిలోని జగ్గయ్యపేట డివిజన్‌కు 950 క్యూసెక్కుల నీటిని తెలంగాణ భూభాగంలో ఉన్న చెర్వుమాధవరం ట్యాంక్ నుంచి విడుదల చేయాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే అక్కడి నుంచి సరిగా నీరు విడుదల కాలేదు. రాష్ట్ర విభజన అనంతరం ఆ ఇబ్బందులు మరింత పెరిగాయి. చెర్వు మాధవరం ట్యాంక్ తెలంగాణ భూభాగంలో ఉండడం వల్ల అక్కడి అధికారులు నీరు విడుదల చేయడం లేదు. అరకొర నీటిని విడుదల చేసినా ట్యాంక్ నుంచి నీరు రాష్ట్రంలోకి రావాలంటే ఆరు కిలోమీటర్ల మేర తెలంగాణ భూభాగంలో ప్రవహించాల్సి ఉంది. ఆ కొద్దిపాటి నీటిని అక్కడి రైతులు వినియోగించుకుంటున్నారు. నీటి సంఘాల ప్రతినిధుల ఒత్తిడి మేరకు అప్పుడప్పుడు మూడు నుంచి ఐదు వందల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అది కూడా అదను పోయిన తర్వాత విడుదల చేయడం వల్ల అన్నదాతలు తీవ్ర నష్టాల పాలవుతున్నారు.
నీటి విడుదలలో మాయాజాలం
లక్షా పదివేల ఎకరాలకు ఖరీఫ్, రబీ సీజన్‌లకు గాను 13 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉండగా, ఎనిమిది టీఎంసీలు మాత్రమే విడుదల చేశారు. అది కూడా వరద నీటిని సైతం లెక్క కట్టి మాయ చేశారు. మరో వైపు జోన్-3 పరిధిలోని నూజివీడు డివిజన్‌కు పాలేరు రిజర్వాయర్ నుంచి 1800 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా, కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా పాలకులు గానీ, ఉన్నతాధికారులు గానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకోకపోవడం వల్ల తెలంగాణ నుంచి నీటిని తీసుకోలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు.
ప్రాధేయపడితే 500 క్యూసెక్కులు వదిలారు..
గత ఏడాది ఆయకట్టులో సాగైన మొక్కజొన్న, మిర్చి, వరి పంటలు చివరి దశలో నీరందక ఎండిపోయాయి. దీంతో పంటలు రక్షించుకొనేందుకు తాపత్రయ పడిన రైతులు పాలకులు, ఎన్‌ఎస్‌పీ ఉన్నతాధికారుల అండదండల కోసం ప్రాకులాడారు. కానీ ఎవరూ ఊతం ఇవ్వలేదు. దీంతో నిస్సహాయ స్థితికి చేరుకున్న రైతులు నేరుగా చెర్వుమాఽధవరం ట్యాంక్ వద్దకు వెళ్లి తెలంగాణ అధికారులను ప్రాధేయపడ్డారు. రైతుల ఆవేదనను ఇక్కడి అధికారులు తేలిగ్గా తీసుకున్నా తెలంగాణ అధికారులు అలా చేయలేదు. అన్నదాతల కన్నీటిని తుడిచేందుకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ నీటిని అక్కడి రైతులు వినియోగించుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి, ఇక్కడి రైతులకు నీటిని పంపారు. దీంతో కొంత మేర అన్నదాతలకు స్వాంతన చేకూరింది. ఏటా ఇదే తంతు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది సాగు చేపట్టాలా వద్దా అన్న ఆలోచనకు అన్నదాతలు వస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టే సమీక్ష ఎన్టీఆర్ జిల్లా సాగర్ ఆయకట్టుకు భరోసా ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. చెర్వుమాధవరం ట్యాంక్‌లో ఎప్పుడూ పుష్కలంగా నీరున్నా దిగువకు నీటిని తీసుకురాలేకపోయిన అధికారులు ముఖ్యమంత్రికి ఏం సమాఽధానం ఇస్తారో చూడాల్సి ఉంది.
ఆటంకంగా పులిచింతల నిబంధనలు
సాగర్ జలాలకు ప్రత్యామ్నాయంగా నిర్మించిన ఎత్తిపోతల పథకాలు కూడా సమర్థవంతంగా పనిచేయడం లేదు. చాలా పథకాలకు కృష్ణానది నీరు అందక నిలిచి పోతున్నాయి. పులిచింతల నుంచి వస్తున్న కొద్దిపాటి నీరు గుంటూరు జిల్లా వైపు ప్రవహిస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ జిల్లా వైపు ఉన్న ఎత్తిపోతల పథకాలు ఆయకట్టును ఎండబెడుతున్నాయి. పులిచింతల నుంచి 500 క్యూసెక్కుల నీరు విడుదలైతే ఎన్టీఆర్ జిల్లా ఎత్తిపోతలకు నీరందనుంది. కానీ పులిచింతల అధికారులు నిబంధనల కారణంగా నీటిని విడుదల చేయలేకపోతున్నారు. కేవలం డెల్టాకు సాగు, తాగునీటి అవసరాల కోసమే ఏర్పడిన పులిచింతలకు 45.77 టీఎంసీల నిల్వ సామర్థం ఉంది. ప్రస్తుతం 35.23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అందులో నుంచి కేవలం 500 క్యూసెక్కులు ఇస్తే వేలాది ఎకరాలకు మేలు జరుగుతుంది. కానీ ఇవ్వడం లేదు. కనిష్టంగా 12 టీఎంసీలు ఉన్నప్పుడే డెల్టా సాగు, తాగునీటి అవసరాలు తీరాయి. కానీ అధికారుల ముందు జాగ్రత్తగా నీటిని నిలిపివేడయం వల్ల సమస్య తలెత్తింది. ఎప్పుడో డెల్టాకు నీరు అవసరమని ఇప్పుటి ఎన్టీఆర్ జిల్లాను ఎండగట్టడం అనాలోచిత నిర్ణయంగా భావించాల్సి ఉంది. దీనిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించి, పులిచింతల నీటి ద్వారా ఎన్టీఆర్ జిల్లా రైతాంగానికి భరోసా కల్పించాల్సి ఉంది.