డబుల్ రిజిస్ట్రేషన్లపై కఠినంగా ఉండండి
ABN , Publish Date - Apr 02 , 2026 | 04:36 AM
అనంతపురం పట్టణ పరిధిలో పలు ప్రైవేటు ఆస్తులకు డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి, వాటికి తార్కిక ముగింపు ఇచ్చేందుకు ...
సబ్ రిజిస్ర్టార్లపై తీసుకునే చర్యలు ఇతర అధికారులకు హెచ్చరిక కావాలి
రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ముఖ్యకార్యదర్శి, ఐజీకి హైకోర్టు ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): అనంతపురం పట్టణ పరిధిలో పలు ప్రైవేటు ఆస్తులకు డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి, వాటికి తార్కిక ముగింపు ఇచ్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అక్రమాలకు పాల్పడినవారిని వదిలేయడానికి వీల్లేదంది. బాధ్యులైన సబ్‌రిజిస్ట్రార్లు, ఇతర సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇతర అధికారులకు ఇదో హెచ్చరికగా ఉండాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. పట్టణంలోని సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన డబుల్ రిజిస్ర్టేషన్ అక్రమలావాదేవీలపై విచారణ జరిపి వాటిని రద్దు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఇ.శ్రీరాములు, మరికొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. ‘అనంతపురం పట్టణ పరిధిలో విలువైన ఆస్తులకు కొందరు వ్యక్తులు ఫోర్జరీ పత్రాలు, నకిలీ జీపీఏలు సృష్టించి ఒకే ఆస్తిని పలువురికి విక్రయిస్తున్నారు. అక్రమార్కులతో చేతులు కలిపి.. ఆస్తుల పూర్వపరాలు పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ అధికారులు డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ విషయంలో ఓ సబ్‌రిజిస్ట్రార్ సస్పెండ్ అయ్యారు. వందల కోట్లు చేతులు మారాయి. అక్రమాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని వినతులు సమర్పించినా అధికారులు స్పందించడం లేదు. డబుల్ రిజిస్ట్రేషన్‌ను అరికట్టేందుకు మార్గదర్శకాలు రూపొందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి’ అని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ డబుల్ రిజిస్ట్రేషన్ కారణంగా ఎవరైనా నష్టపోయి ఉంటే వారే నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చు కదా? మీరు పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. ఇందులో విస్తృత ప్రజా ప్రయోజనాల కన్నా వ్యక్తిగత సమస్యలున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. అందువల్ల ఈ వ్యాజ్యంలో పిటిషనర్లు కోరిన విధంగా ఆదేశాలు ఇవ్వలేమని, ఇందుకు తమ అసాధారణ న్యాయపరిధిని ఉపయోగించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.