Share News

స్త్రీనిధి కి డిజిటల్ హంగులు

ABN , Publish Date - Feb 09 , 2026 | 04:22 AM

గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమం(సెర్ప్‌)లో భాగంగా డ్వాక్రా సంఘాల కోసం ఏర్పాటు చేసిన ‘స్త్రీనిధి’కి కొత్తగా డిజిటల్‌ హంగులు అద్దేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

స్త్రీనిధి కి డిజిటల్ హంగులు

  • ఇకపై పుస్తకాల్లో పద్దులు రాసే విధానానికి స్వస్తి

  • స్త్రీనిధి కార్యకలాపాల కోసం ఏఐ తరహా యాప్‌

  • దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే రుణాలు

  • బ్యాంకింగ్‌ సామర్థ్యం పెంపునకు 170 మంది అసిస్టెంట్‌ మేనేజర్ల నియామకం

  • వచ్చే ఆర్థిక ఏడాది 12 వేల కోట్ల రుణాల లక్ష్యం

అమరావతి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమం(సెర్ప్‌)లో భాగంగా డ్వాక్రా సంఘాల కోసం ఏర్పాటు చేసిన ‘స్త్రీనిధి’కి కొత్తగా డిజిటల్‌ హంగులు అద్దేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వైసీపీ హయాంలో అస్తవ్యస్తంగా మారిన స్త్రీనిధి బ్యాంకింగ్‌ వ్యవహారాలను ఒక కొలిక్కి తెచ్చేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళా సమాఖ్యలకు బ్యాంకింగ్‌ సేవలు అందించాలని నిర్ణయించింది. పాత పద్ధతిలో అప్పులిచ్చి పుస్తకాల్లో పద్దులు రాసే విధానం నుంచి డిజిటల్‌ విధానంలోకి వచ్చేందుకు చర్యలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రారంభించారు. దరఖాస్తు చేసుకున్న డ్వాక్రా మహిళలకు 48 గంటల్లోనే రుణాలందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో స్త్రీనిధి బ్యాంకింగ్‌ సామర్థ్యం పెంచుకునేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ 170 మంది అసిస్టెంట్‌ మేనేజర్ల నియామక ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. దీంతో పాటు స్త్రీనిధి కార్యకలాపాల కోసం ఏఐ విధానంలో యాప్‌ తీసుకొచ్చారు. ఈ యాప్‌ ద్వారా మరింత పారదర్శకతత పెంచేందుకు పలు చర్యలు తీసుకున్నారు.


మైక్రో ఫైనాన్స్‌ బారిన పడకుండా చర్యలు

చిన్న వ్యాపారులు, పేద మహిళలు చిన్న అవసరాల కోసం మైక్రో ఫైనాన్స్‌ బారిన పడకుండా స్త్రీనిధి ఆదుకుంటోంది. అధిక వడ్డీ భారం మహిళలపై పడకుండా స్త్రీనిధి సేవలను విస్తృతపరచాలని ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. అత్యవసర ఆరోగ్య సమస్యలు, పెళ్లిళ్లు, ఇతర కార్యాలకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా రెండు రోజుల్లో రుణం పొందేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఇస్తున్న రుణపరిమితిని పెంచి.. అవసరాలకు అనుగుణంగా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. బ్యాంకుల కంటే వేగంగా రుణ ప్రక్రియ పూర్తిచేసి, మహిళా సంఘాలకు రుణాలిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రీజినల్‌ మేనేజర్‌ స్థాయి అధికారిని స్త్రీనిధి ఎండీగా నియమించి, అత్యవసర రుణపరపతి కల్పిస్తున్నారు.


170 మందిలో 97 మంది మహిళలే..

ఇటీవల స్త్రీనిధి ద్వారా చేపట్టిన అసిస్టెంట్‌ మేనేజర్ల నియామకంలో ఎక్కువ మంది గ్రామీణ పేదలకు అవకాశం కల్పించినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న వీవోఏలలో 17 మందికి పైగా అసిస్టెంట్‌ మేనేజర్లుగా నియమించనున్నట్లు తెలిసింది. సెర్ప్‌లో బుక్‌ కీపర్లుగా పనిచేస్తున్న ఐదుగురిని, బ్యాంకు కార్యకలాపాల్లో అనుభవమున్న వారిని ఈ పోస్టుల్లో నియమించనున్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం పారదర్శకంగా చేపట్టిన నియామకాల్లో మహిళలకు పెద్దపీట వేశారు. రిజర్వేషన్ల ప్రకారం మహిళలను 57 మంది నియమించాల్సి ఉంటే.. 97 మంది మహిళలు అసిస్టెంట్‌ మేనేజర్లుగా నియమితులయ్యారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ త్వరలో వారందరికీ నియామకపత్రాలు అందించి, విధుల్లోకి తీసుకోనున్నారు.


త్వరలో అందుబాటులోకి యాప్‌

స్త్రీనిధి కార్యకలాపాల కోసం ఏఐ ఆధారిత కొత్త యాప్‌ను వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్త్రీనిధి ఎండీ హరిప్రసాద్‌ తెలిపారు. ఈ యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు రుణాలు తిరిగి చెల్లించడం, రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడం, బయోమెట్రిక్‌ విధానం ద్వారా పేపర్‌లెస్‌ ప్రక్రియకు తెరదీయనున్నామని వివరించారు. ఇప్పటికే యాప్‌ వినియోగంపై వీవోఏలు శిక్షణ పొందడంతో.. రుణ ప్రక్రియ సులభతరం చేయనున్నట్లు పేర్కొన్నారు.

స్త్రీనిధి రుణ పరపతి పెంపు

స్త్రీనిధి రుణపరపతిని పెంచాలని అధికారులు భావిస్తున్నారు. గతంలో ఏడాదికి రూ.2వేల కోట్లు అందిస్తున్న స్త్రీనిధి.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.5,700 కోట్లకు పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా సంఘాలకు రూ.12వేల కోట్ల రుణాలందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఒక్కో స్వయం సహాయక సంఘానికి రూ.5 లక్షల వరకు రుణం అందిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు రూ.8 లక్షలకు పెంచింది. స్త్రీనిధి బ్యాంకింగ్‌ సామర్థ్యం పెంచేందుకు 170 మంది అసిస్టెంట్‌ మేనేజర్లను తీసుకోనున్నారు. ఇప్పటికే ఈ పోస్టుల కోసం దరఖాస్తుల ప్రక్రియ పూర్తిచేసి, త్వరలో నియామకపత్రాలు అందించేందుకు రంగం సిద్దం చేశారు. ఇప్పటికే స్త్రీనిధి ద్వారా రుణాలు పొందేందుకు వీవోఏలు డ్వాక్రా సంఘాలకు సహాయంగా ఉన్నారు. నియోజకవర్గస్థాయిలో అసిస్టెంట్‌ మేనేజర్ల ద్వారా స్త్రీనిధి సేవలు విస్తృతపరచాలని నిర్ణయించారు.

Updated Date - Feb 09 , 2026 | 05:59 AM