వైసీపీ సర్పంచ్ ఇంట్లో చోరీ సొత్తు
ABN , Publish Date - Feb 20 , 2026 | 03:46 AM
ఒక దొంగ అపహరించుకు వచ్చిన వెండి, బంగారపు వస్తువులు ఒక వైసీపీ సర్పంచ్ ఇంట్లో లభ్యమయ్యాయి.
పోలీసుల అదుపులో దొంగతో పాటు సర్పంచ్
ఏలూరు క్రైం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ఒక దొంగ అపహరించుకు వచ్చిన వెండి, బంగారపు వస్తువులు ఒక వైసీపీ సర్పంచ్ ఇంట్లో లభ్యమయ్యాయి. దొంగ జాడను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించిన పోలీసులు అతడితో పాటు సర్పంచ్‌ను విచారణ కోసం తీసుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు.. దెందులూరుకు చెందిన సత్తినపల్లి రాకేశ్(24) 2022 నుంచి ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్నాడు. అతడిపై పోలీసులు సస్పెక్ట్ షీటు తెరిచారు. కొద్దికాలం క్రితం అరెస్టు చేయడంతో నాలుగు రోజుల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఒక వాలీబాల్ జట్టు సభ్యులతో కలిసి ఒంగోలు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో టీమ్‌తో కాకుండా వేరుగా వెళ్లిపోయాడు.ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్రకుమార్ మాతృమూర్తి ప్రమీలాదేవి పొన్నూరు పరిధిలోని చింతలపూడిలో నివాసం ఉంటున్నారు. రాకేశ్ ఒంగోలు నుంచి వస్తూ ఆమె ఇంట్లో రూ.70లక్షల విలువైన వెండి, బంగారపు వస్తువులను చోరీ చేశాడు. పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య బృందం సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి రాకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. చోరీ సొత్తు ఏలూరు రూరల్ మండలం చాటపర్రు సర్పంచ్ రఘు(వైసీపీ) నివాసంలో ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.