‘మూలకణ’ చికిత్సలతో అద్భుతాలు!
ABN , Publish Date - Jul 13 , 2026 | 03:06 AM
‘మూలకణ చికిత్సల(స్టెమ్‌సెల్స్ థెరపీ)పై దేశవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఎన్నో దీర్ఘకాలిక, మొండివ్యాధులకు ఈ విధానంతో చెక్ పెట్టే అవకాశం ఉంది.
భవిష్యత్తు వైద్య రంగం స్టెమ్ సెల్స్ థెరపీదే
ఈ విధానంలో ఎన్నో మొండి వ్యాధులకు చెక్
దేశవ్యాప్తంగా సాగుతున్న విస్తృత పరిశోధనలు
రీజనరేటివ్ మెడిసిన్ నిపుణుడు విజయ్ రాజేశ్ వెల్లడి
గుంటూరు మెడికల్, జూలై 12(ఆంధ్రజ్యోతి): ‘మూలకణ చికిత్సల(స్టెమ్‌సెల్స్ థెరపీ)పై దేశవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఎన్నో దీర్ఘకాలిక, మొండివ్యాధులకు ఈ విధానంతో చెక్ పెట్టే అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులో దేశీయ వైద్యరంగం స్టెమ్ సెల్స్ చికిత్సతో అద్భుతాలు చేయనుంది’ అని రీజనరేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎ. విజయ్ రాజేశ్ తెలిపారు. గుంటూరులోని సమిష్ట హాస్పిటల్స్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(శ్రీ హాస్పిటల్)లో ఇన్‌హౌస్ ఇన్‌విట్రో స్పెషలిస్ట్‌గా సేవలు అందిస్తున్న విజయ్ రాజేశ్, పలు రాష్ట్రాల్లోని వైద్యశాలల్లో ఫ్రీలాన్స్ వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో సిబ్బందికి స్టెమ్ సెల్స్ థెరపీ గురించి, వీటి పరిశోధన, భవిష్యత్తులో రీజనరేటివ్ మెడిసిన్ ప్రాధానయం గురించి అవగాహన కల్పిస్తున్నారు. అమెరికన్ బోర్డ్ ఆఫ్ రీజనరేటివ్ మెడిసిన్‌లో డిప్లమేట్ చేసిన ఆయన, ఈ ఘనత సాధించిన అతి కొద్దిమంది భారతీయుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. రీజనరేటివ్ మెడిసిన్ గురించి, వీటిపై జరుగుతున్న పలు పరిశోధనల విశేషాలను ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ఆయన మాటల్లోనే..
34 రకాల వ్యాధులకు చికిత్స
మూలకణ వైద్య చికిత్సపై ఇప్పుడిప్పుడే ఆసక్తి కనిపిస్తోంది. మూలకణాల్లో యూనిపొటెంట్స్, టోటీపొటెంట్స్, మల్టీపొటెంట్స్, ప్లూరీ పొటెంట్స్ వంటి పలు రకాలున్నాయి. ప్రస్తుతం రోగుల చికిత్సల్లో మల్టీపొటెంట్స్ కణాలు వాడుతున్నారు. మధుమేహం నుంచి ఆర్థోపెడిక్, ఈఎన్‌టీ, గైనకాలజీ, డెర్మటాలజీ, హృదయ, నాడీ సంబంధ రుగ్మతలు, పలు రకాల క్యాన్సర్లకు మూలకణ చికిత్సలపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి ఫలిస్తే ఈ చికిత్సలు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చాలా తక్కువ ఖరీదుతోనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 34 రకాల వ్యాధులకు స్టెమ్‌సెల్స్ థెరపీ వాడవచ్చని కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఈ ఏడాది మార్చిలో అధికారికంగా ప్రకటన జారీ చేయడం గేమ్ చేంజర్. టెస్టిక్యూలర్ ట్యూమర్స్, మల్టిపుల్ స్ల్కీరోసిస్, మైలో ఫైబ్రోసిస్, న్యూరో బ్లాస్టోమా, మ్యూకో పాలిశాఖరైడోసిస్, ఎక్వైర్డ్ సివియర్ ఎప్లాస్టిక్ ఎనీమియా, ఎక్యూట్ మైలాయిడ్ లుకేమియా, మల్టీపుల్ మైలోమా, తలసీమియా వంటి పలు రక్తసంబంధిత వ్యాధులకు మూలకణాలతో చికిత్స చేయవచ్చని కేంద్రం అనుమతులు జారీ చేసింది. క్యాన్సర్ వ్యాధులకు చేసే బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా స్టెమ్‌సెల్ థెరపీనే. ఫలితాలు అనుకూలంగా ఉండటంతో రోగులకు స్టెమ్‌సెల్స్ చికిత్సలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.
వైద్య పరిశోధనలు ఇలా...
చెవిలో హోరుమనే శబ్దంతో వృద్ధులకు చికాకు కలిగించే వ్యాధి టిన్నిటస్. చెవిలో హియర్ ఎయిడ్ పెట్టి శ్రావ్యమైన సంగీతం వినిపించడమే ఇప్పటి వరకు దీనికి చేస్తున్న చికిత్స. గుంటూరు జిల్లా చినకాకానిలోని ఎన్నారై జనరల్ హాస్పిటల్‌లో ఎంపిక చేసిన టిన్నిటస్ రోగులపై స్టెమ్‌సెల్స్ థెరపీతో త్వరలో ప్రయోగాత్మక చికిత్సలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తు న్నాం. ఇంకా కర్ణభేరి సమస్యలకు, ఎట్రోపిక్ రైనైటిస్ వంటి వ్యాధులకు కూడా స్టెమ్‌సెల్స్‌తో చికిత్సలు చేస్తున్నారు.
డయలేటెడ్ కార్డియోమయోపతి (హృదయ వైఫల్యం) చెందిన రోగులకు ఖరీదైన గుండె మార్పిడి శస్త్రచికిత్సే మార్గం. వీరికి గుంటూరు సమిష్ట హాస్పిటల్‌లో ఆటోలోగస్ స్టెమ్‌సెల్ చికిత్స చేయడం ద్వారా గుండె పంపింగ్ సామర్ధ్యం పెరిగింది. వారు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్(ఎంఐ) రోగులకు తొలి మూడు, నాలుగు గంటల్లో స్టెమ్‌సెల్స్ ఇచ్చే థెరపీపై పరిశోధనలు జరుగుతున్నాయి.
స్త్రీల్లో వంధ్యత్వానికి కారణమయ్యే ఎండోమెట్రియాసి్‌సకు మూలకణ చికిత్సలపై చండీగఢ్‌లోని వైద్యశాలలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. సంతానం లేని మహిళలకు ఆటోలోగస్ హిమటోపోయెటిన్ మూలకణ చికిత్సలను ఢిల్లీలోని ప్రముఖ వైద్యశాలలో చేస్తున్నారు. ఇది ప్రయోగ దశలో ఉంది. ఇది ఫలిస్తే కృత్రిమ గర్భధారణ పద్ధతులు అవసరం లేకుండా సహజంగానే గర్భం ఽధరించే అవకాశం ఉంటుంది.
మూత్రంలో రక్తం (బ్లడ్ ఇన్‌కాంటినెన్స్) పడేవారికి మూలకణ చికిత్సతో స్ప్లింకర్స్ మజిల్స్ బలోపేతం చేయడంవల్ల ఈ సమస్యను పరిష్కరిం చే అవకాశముంది. చెన్నైలోని స్టాన్లీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి.
స్పైనల్ కార్డ్ గాయాలతో మంచానికి పరిమితమైన బాధితులకు స్టెమ్‌సెల్ థెరపీతో చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వీరికి బోన్‌మ్యారో నుంచి స్వీకరించిన, ఆటోలోగస్ హిమటోపయోటిక్ స్టెమ్‌సెల్స్ ఇస్తున్నాం.
మధుమేహం నియంత్రణలో లేని రోగుల కోసం ఈ చికిత్సలు ప్రయోగ దశలోనే ఉన్నాయి. వీరికి గ్లైకోజినేటెడ్ హిమోగ్లోబిన్ (హెచ్‌బీఏ1సీ)ను మూడు పాయింట్ల వరకు తగ్గించగలిగారు.
పక్షవాతం, ఆల్జీమర్స్, పార్కిన్సోనిజం, బొల్లి వంటి వ్యాధులపై అమెరికాలో స్టెమ్‌సెల్స్ థెరపీతో విస్తృతంగా పరిశోధనలు రుగుతున్నాయి. భవిష్యత్తులో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశముంది.