Share News

మరో ఏడాది ఇలా కష్టపడితే చాలు

ABN , Publish Date - Feb 05 , 2026 | 05:21 AM

స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు ఇంకో ఏడాది ఇదేవిధంగా కష్టపడితే సమస్యలన్నింటినీ అధిగమిస్తామని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్‌ పౌండ్రిక్‌ అన్నారు.

మరో ఏడాది ఇలా కష్టపడితే చాలు

  • స్టీల్‌ ప్లాంట్‌ సమస్యలన్నీ తీరిపోతాయి

  • కేంద్ర ఉక్కు కార్యదర్శి సందీప్‌ పౌండ్రిక్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు ఇంకో ఏడాది ఇదేవిధంగా కష్టపడితే సమస్యలన్నింటినీ అధిగమిస్తామని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్‌ పౌండ్రిక్‌ అన్నారు. బుధవారం ప్లాంట్‌ను సందర్శించిన ఆయన ఎంపిక చేసిన 400 మందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ ఉక్కుపై కేంద్ర ఉక్కు, ఆర్థిక శాఖలకు ఇప్పటివరకూ ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. చాలా తక్కువ అంచనాలతో ఆర్థిక ప్యాకేజీ అందిస్తే ఉద్యోగులు లక్ష్యాలను అధిగమించి చాలా గొప్ప ఫలితాలు సాధించారని సందీప్‌ ప్రశంసించారు. ఉత్పత్తి వ్యయం టన్నుకు రూ.48వేలు అవుతోందని, దానిని రూ.40వేల నుంచి రూ.42 వేల మధ్యకు తీసుకురావాలని సూచించారు. కొత్త ఎగ్జిక్యూటివ్‌ల నియామకం మొదలవుతుందని, అదేవిధంగా ఏప్రిల్‌ నుంచే పనితీరు ఆధారంగా ప్రమోషన్లు కూడా ఇస్తారని సందీప్‌ చెప్పారు. సీఎండీ మనీష్ రాజ్‌ గుప్తా మాట్లాడుతూ, ఉద్యోగుల వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇంకో రెండు నెలల్లో తొలగిపోతాయని అన్నారు. విశాఖ ఉక్కు పనితీరు సెయిల్‌ ప్లాంట్ల కంటే గొప్పగా ఉందని ప్రశంసించారు.

Updated Date - Feb 05 , 2026 | 05:21 AM