పాల విక్రయ కేంద్రాల్లో అధికారుల తనిఖీలు
ABN , Publish Date - Feb 26 , 2026 | 05:20 AM
రాజమ హేంద్రవరంలో కల్తీ పాల ఘటన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్...
రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 150 నమూనాల సేకరణ
మరో వారంపాటు తనిఖీలు: ఐపీఎం డైరెక్టర్
అమరావతి/అనంతపురం క్రైం, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): రాజమ హేంద్రవరంలో కల్తీ పాల ఘటన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు ఒక్క రోజే 150 పాల నమూనాలు సేకరించారు. నమూనాలను హైదరాబాద్, చెన్నై, కాకినాడ, తిరుపతిలోని గుర్తింపు పొందిన ల్యాబ్‌లకు పంపారు. అనంతపురం లో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి నగరంలోని ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. కళ్యాణదుర్గం రోడ్డు, రాంనగర్ 80 అడుగుల రోడ్డు, శ్రీకంఠం సర్కిల్‌లోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్న పాలను పరిశీలించారు. కళ్యాణదుర్గం రోడ్డులో విక్రయిస్తున్న సుమారు 20 లీటర్ల పాలు కల్తీ అయినట్టు నిర్ధారించి, వాటిలో ఫినాయిల్ కలిపి నిరుపయోగంగా మార్చారు. ఒక కేంద్రంలోని ఫ్రిజ్‌లో 30 లీటర్ల పాలు పాడైపోయినట్టు గుర్తించారు. మరో చోట 70 లీటర్ల పాలల్లో నాణ్యత లోపించినట్టు గుర్తించి పారబోశారు. దాడులు నిర్వహించిన ప్రాంతాల్లో పాల నమూనాలను సేకరించారు. ఐదు ప్రాంతాల్లో సేకరించిన పది నమూనాలను హైదరాబాద్‌లోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు.
కాకినాడలో నాణ్యతలేని ఐదు కిలోల పాలపొడిని సీజ్ చేశారు. ప్రధానంగా పాల క్యాన్లు, లూజు పాల విక్రయాలు జరిగే కేంద్రాల్లో ఈ తనిఖీలు జరుపుతున్నారు. రూ.8 వేల విలువైన మ్యాజిక్ కిట్లతో పాల నాణ్యతని అధికారులు గుర్తిస్తున్నారు. వీటిని రాష్ట్రంలోని 28 జిల్లాలకు పంపారు. పాలలో యూరియా, పిండి పదార్ధం, వెజిటబుల్ ఆయిల్స్ వంటివి ఏది కలిపినా మ్యాజిక్ కిట్‌లో ఉండే లాక్టో మీటర్ వంటి పరికరాల ద్వారా తెలిసిపోతుందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్ డైరెక్టర్ నీలకంఠారెడ్డి చెప్పారు. పాల విక్రయాల్లో అవకతవకలకు పాల్పడినా, తప్పుడు విధానాలు అవలంభిం చినా వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో ఆయన హెచ్చరించారు. పాల కేంద్రాల్లో తనిఖీలు మరో వారం కొనసాగుతాయని ప్రకటించారు. కాగా.. పాల పదార్ధాల నమూనాలు తిరుపతి ఐఐటీలో అత్యాధునిక ల్యాబ్‌కు చేరాయి.