ఆర్థిక క్రమశిక్షణ ఏదీ?
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:09 AM
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి బడ్జెట్లో (2024-25) అంచనాలకు, వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు.
రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వం లేదు
2024-25 ఆర్థిక సంవత్సరంపై కాగ్ నివేదిక
రోజువారీ ఖర్చులకూ అప్పులే
అప్పుల్లో 24 శాతమే మూలధన వ్యయం
జీఎస్‌డీపీలో లోటు 3.75 శాతానికి
ఇలాగైతే భవిష్యత్ అంధకారమే
అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ‘‘కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి బడ్జెట్లో (2024-25) అంచనాలకు, వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు. రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వం లేదు’’ అని కాగ్ పేర్కొంది. ఇలాగైతే భవిష్యత్తు అంధకారమేనని, గడ్డుకాలం తప్పదని హెచ్చరించింది. 2024-25లో జీఎ్‌సడీపీ భారీగా 11 శాతానికిపైగా పెరిగినప్పటికీ, రాష్ట్ర ఆదాయం 3 శాతానికి పైగా తగ్గడంపై విస్మయం వ్యక్తం చేసింది. రోజువారీ అవసరాల కోసం అప్పులు చేయాల్సి రావడం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి సంకేతమని పేర్కొంది. 2024-25లో అప్పులు 16 శాతం పెరగ్గా, మూలధన వ్యయం 12 శాతం తగ్గడం ప్రమాదకరమని వెల్లడించింది. కాగ్ నివేదిక ప్రకారం.. 2024-25లో అన్ని మార్గాల ద్వారా ఆదాయం రూ.2,69,928 కోట్లు వస్తుందని అంచనా వేయగా, రూ.2,49,191 కోట్లు వచ్చింది. పన్ను ఆదాయం ద్వారా రూ.1,60,264 కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా, ఖజానాకు రూ.1,41,515 కోట్లు వచ్చింది. పన్నేతర ఆదాయాన్ని రూ.10,576 కోట్లుగా అంచనా వేయగా, రూ.5,972 కోట్లు మాత్రమే వచ్చింది. రూ.30,333 కోట్ల గ్రాంట్లు వస్తాయని బడ్జెట్లో పేర్కొనగా, రూ.20,188 కోట్లు మాత్రమే వచ్చాయి. అప్పులు రూ.68,743 కోట్లు అని అంచనా వేశారు కానీ, వాస్తవానికి రూ.81,071 కోట్లు తెచ్చారు.
కాగ్ నివేదికలోని అంశాలు
బడ్జెట్లో రూ.2,35917 కోట్ల రెవెన్యూ వ్యయం అంచనా వేయగా, దాన్ని రూ.2,27,961 కోట్లకే పరిమితం చేశారు. మూలధన వ్య యాన్ని రూ.32,713 కోట్లుగా అంచనా వేయగా, రూ.16,141 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. లోన్లు, అడ్వాన్సుల రూపంలో రూ.1,298 కోట్లు ఖర్చవుతాయని బడ్జెట్లో పేర్కొనగా, ఈ పద్దు కింద రూ. 5,032 కోట్లు ఖర్చు చేశారు. రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లుగా అంచనా వేయగా, రూ.60,285 కోట్లకు చేరింది. ద్రవ్యలోటు రూ. 68,743 కోట్లకు అంచనా వేయగా, రూ.81,071 కోట్లకు పెరిగింది.
2024-25లో రాష్ట్ర ప్రభుత్వం 107 రోజులు ఓడీలో ఉంటూ రూ.56,631 కోట్లు వాడుకుంది. ఇందుకు గాను ఆర్‌బీఐకి రూ.32 కోట్ల వడ్డీ చెల్లించింది. 179 రోజుల పాటు వేజ్ అండ్ మీన్స్ అప్పు కింద రూ.73,897 కోట్లు వాడుకుని, రూ.82.3 కోట్ల వడ్డీ చెల్లించింది. 71 రోజుల పాటు ఎస్‌డీఎఫ్ అప్పు రూ.42,004 కోట్లు వాడుకుని, రూ.188.82 కోట్ల వడ్డీ చెల్లించింది. 2024-25లో ఆర్‌బీఐ నుంచి ఈ 3 రకాల అప్పుల రూపంలో మొత్తం రూ.1,72,532 కోట్లు వాడుకుని రూ.303 కోట్ల వడ్డీ చెల్లించింది.
ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం జీఎ్‌సడీపీలో రెవెన్యూ లోటు 2.7 ఉండాలన్న లక్ష్యం నెరవేరలేదు. 2024-25లో 3.75 శాతానికి చేరుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తన రోజువారీ ఖర్చుల కోసం కూడా అప్పు చేయాల్సి వస్తోంది. 4 శాతం ఉండాల్సిన ద్రవ్యలోటు 5.05 శాతానికి చేరింది. మొత్తం అప్పులు రూ.81,071 కోట్లకు చేరడం వల్ల మూలధన వ్యయానికి వెసులుబాటు లేకుండా పోయింది.
2024-25లో అప్పులు 16.08ు మేర పెరిగాయి. మూలధన వ్యయం 12ు మేర తగ్గింది. మొత్తం అప్పుల్లో 24 శాతం మాత్రమే మూలధన వ్యయానికి వాడారు.
2024-25లో జీఎ్‌సడీపీ 11.56ు పెరిగింది. కానీ రెవెన్యూ ఆదాయం 3.51 శాతం తగ్గింది.
2024-25లో వాస్తవంగా చేసిన ఖర్చు రూ.2,27,961 కోట్లు కాగా, బడ్జెట్లో రూ.63,678 కోట్లు ఎక్కువగా అంచనా వేశారు. రెవెన్యూ వ్యయంలో కమిటెడ్ వ్యయం 44.34ు ఉంది. కమిటెడ్ వ్య యంలో వేతనాల కోసం రూ.41,899 కోట్లు, పెన్షన్ల కోసం రూ. 26,952 కోట్లు, వడ్డీ చెల్లింపుల కోసం రూ.31,321 కోట్లు ఉన్నాయి.
2024-25లో పబ్లిక్ డెట్ రూ.78,098 కోట్లు పెరిగింది. దీంతో మొత్తం పబ్లిక్ డెట్ రూ.4,93,716 కోట్లకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పులు రూ.5,67,222 కోట్లకు చేరుకున్నాయి. 2023-24లో మొత్తం అప్పు రూ.4,86,151 కోట్లుగా ఉంది.
2024-25లో రాష్ట్ర ప్రభుత్వం రూ.4,079 కోట్లు మాత్రమే ట్రెజరీ బిల్స్‌లో పెట్టుబడి పెట్టగా, 2023-24లో రూ.21,414 కోట్లు పెట్టుబడి పెట్టారు.
రూ.2,677.64 కోట్ల ఖర్చును మూలధన వ్యయం కింద చూపకుండా రెవెన్యూ వ్యయం కింద చూపించారు.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌తో సంబంధం లేకుండా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లకు అప్పులు తెచ్చుకోవడం కోసం గ్యారెంటీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని అంతర్జాతీయ ఏజెన్సీల నుంచి లోన్లు, గ్రాంట్లు వచ్చాయి.
2024-25లో కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్వహణ కోసం రూ. 17,557.54 కోట్లు ఖర్చు చేశారు. కేంద్రం వాటా రూ.11,408.97 కోట్లు కాగా, రాష్ట్రం వాటా రూ.6,148.58 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయంరూ.12,313.49 కోట్లు, మూలధన వ్యయం రూ.5,244 కోట్లు.
పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం
ప్రభుత్వానికి రూ.కోట్లలో నష్టం
వాణిజ్య పన్నుల శాఖకు కాగ్ అక్షింతలు
అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): పన్నుల వసూళ్లలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నిర్లక్ష్య వైఖరిని కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. 2023 చివరి నాటికి రూ.1,954.30 కోట్లతో ముడిపడిన 1,588 తనిఖీ నివేదికలను పరిష్కరించలేదని కాగ్ నివేదికలో పేర్కొంది. కేంద్ర అమ్మకపు పన్ను టర్నోవర్‌ను తప్పుగా లెక్కించడం వల్ల తొమ్మిది కేసుల్లో రూ.1.40 కోట్ల మేర పన్ను తక్కువగా విధించినట్లు గుర్తించింది. వ్యాట్ కేసుల్లో రిటర్న్‌లు ఆలస్యంగా దాఖలు చేయడం, పన్ను తక్కువగా ప్రకటించిన సందర్భాల్లో జరిమానాకు సంబంధించిన నిబంధనలను పాటించకపోవడం వల్ల ఆరు కేసుల్లో రూ.94 లక్షలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని తెలిపింది. పన్ను పరిధిలోకి వచ్చే టర్నోవర్‌ను మదింపు చేసేటప్పుడు ముందస్తు చెల్లింపులను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల రూ.40.10 లక్షల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయిందని వెల్లడించింది. వ్యాట్ వసూలు చేసేటప్పుడు రెండు సందర్భాల్లో టర్నోవర్‌ను తప్పుగా లెక్కించడం వల్ల రూ.6.48 లక్షల పన్ను తక్కువ విధించినట్లు కాగ్ నివేదిక పేర్కొంది.