Share News

స్వచ్ఛతపై స్తబ్ధత!

ABN , Publish Date - Feb 04 , 2026 | 01:07 AM

నగర ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించటానికి, కాలుష్య కారకాలను నివారించేందుకు, గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపట్టిన క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌లో కొన్నాళ్లుగా స్తబ్ధత నెలకొంది. దీంతో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం భయపెడుతోంది. నివారణకు యుద్ధ ప్రాతిపదికన క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ స్పీడ్‌ పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద నగరంగా ఉన్న విజయవాడను కాలుష్యం భారి నుంచి తప్పించాలంటే.. ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగం ప్రోత్సహించడం, కాలుష్య కారక వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

స్వచ్ఛతపై స్తబ్ధత!

- క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌పై నీలినీడలు

- నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం

- ప్రమాదకర పరిమాణంలో రోడ్లపై దుమ్ము, ధూళి

- ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగంపై ప్రోత్సాహం అవసరం

- కాలుష్య కారక వాహనాలపై కఠిన చర్యలు అవశ్యం

- వెర్టికల్‌ గార్డెన్స్‌ పెంపుపై ప్రత్యేక కార్యాచరణ అవసరం

నగర ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించటానికి, కాలుష్య కారకాలను నివారించేందుకు, గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపట్టిన క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌లో కొన్నాళ్లుగా స్తబ్ధత నెలకొంది. దీంతో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం భయపెడుతోంది. నివారణకు యుద్ధ ప్రాతిపదికన క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ స్పీడ్‌ పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద నగరంగా ఉన్న విజయవాడను కాలుష్యం భారి నుంచి తప్పించాలంటే.. ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగం ప్రోత్సహించడం, కాలుష్య కారక వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

నగర వాసులు కాలుష్యంతో అల్లాడుతున్నారు. గత నాలుగేళ్లుగా పీఎం 10 సూక్ష్మ ధూళికణాల పరిమాణం అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన రెండు సంవత్సరాల్లో చూస్తే 2024-25లో పీఎం 10 సూక్ష్మ, ధూళికణాల పరిమాణం 64 యూజీఎంగా నమోదైంది. దీన్ని గణనీయంగా తగ్గించేందుకు చేపడుతున్న చర్యలు అంతగా సత్ఫలితాలను ఇవ్వటం లేదు. నగరంలో సూక్ష్మ ధూళికణాల సంఖ్య పెరగటానికి గ్రావెల్‌, ఇసుక, కంకర లారీలే ప్రధాన కారణం. ఇవి నగరంలోనీ ప్రధాన మార్గాలు, హైవేల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఎంత పరదా కప్పినా.. ఇసుక, కంకర, మట్టి, గ్రావెల్‌ వంటివి రోడ్డు మీద పడుతున్నాయి. విజయవాడలో వీఐపీ కారిడార్‌ మొత్తం దుమ్ము, ఽధూళి కలబోతగా మారిపోయింది. వీఐపీ కారిడార్‌ పరిస్థితే ఇలా ఉంటే.. మిగిలిన చోట్ల పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటున్నాయో అర్థం చేసుకోవాల్సిందే. వాహనాలు విడుదల చేస్తున్న పొగ కారణంగా.. ఇప్పటికే నగరంలో కర్బన్‌ ఉద్గారాల విడుదల గణనీయంగా పెరిగింది. అటు పొగ.. ఇటు దుమ్ము రెండూ కలిసి వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయి. నగరంలోని హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ స్టేషన్ల ద్వారా వస్తున్న డేటా కూడా ఆందోళన కలిగిస్తోంది. జిల్లా యంత్రాంగం కిందటేడాది జూన్‌లో జాతీయ శుద్ధ వాయు కార్యక్రమం (ఎన్‌సీఏపీ) అమలుకు సంబంధించి నిర్వహించిన కార్యక్రమంలో విజయవాడ నగరాన్ని వాయుకాలుష్యం బారి నుంచి కాపాడటానికి, గాలి నాణ్యతను పెంచటానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినా వీటిని అమలు చేయటానికి వేగంగా అడుగులు పడటం లేదు.

రోడ్లపై ధూళి నివారణకు సత్వర చర్యలు అవసరం

నగరం రోడ్లపై ధూళిని నివారించటానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. నగరం మీదుగా భారీ టిప్పర్లు మట్టి, గ్రావెల్‌, ఇసుక, కంకరను తీసుకువెళుతున్నాయి. పరదాలు కప్పించినా సరే.. రోడ్లపై ఇసుక, మట్టి, గ్రావెల్‌, కంకరపొడి, కంకర కింద పడుతోంది. అందువల్ల భారీ టిప్పర్ల రాకపోకలు నగరం మీదుగా లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. నగరం వెలుపల నుంచి వెళ్లే విధంగా రూట్లను మార్చాల్సిన అవసరం ఉంది. గ్రీన్‌బెల్టుల్లో ఎక్కువుగా మట్టి వేయటం వల్ల వర్షం కురిసినప్పుడు, నీరు పడినప్పుడు ఆ మట్టి కారి రోడ్ల మార్జిన్ల మీదకు వస్తోంది. ఇలాంటి చర్యలను కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది.

- ఈ మొబిలిటీని ప్రోత్సహించాలి :

నగరంలో ఎలక్ర్టిక్‌ బస్సులు, కార్లు, క్యాబ్‌లు, ఆటో రిక్షాలు, ద్విచక్రవాహనాలు వంటి వాటిని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నగరానికి ఆర్టీసీ పరిధిలో అతి త్వరలో 100 ఎలక్ర్టిక్‌ బస్సులు రానున్నాయి. నగర ప్రజలు పాత కార్లకు స్వస్తి చెప్పి ఈవీ కార్ల బాట పడుతున్నారు. నగరంలో ట్రాఫిక్‌ ఆగినపుడు చూస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అదే విధంగా ఈవీ క్యాబ్‌లను కూడా జిల్లా యంత్రాంగం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ద్విచక్రవాహనాలను కూడా ఈ మొబిలిటీ కిందకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. నగర రోడ్లపై సింహభాగం ద్విచక్రవాహనాలే నడుస్తుంటాయి. వీటిని కూడా ఎలక్ర్టిక్‌ వాహనాల దిశగా నడిపించటానికి ప్రోత్సాహకాలతో కూడిన సామూహిక, భాగస్వామ్య కార్యక్రమాలను వేగంగా నడిపించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నం జిల్లా యంత్రాంగం కొంత చేస్తున్నా.. ఒకటి అరా కార్యక్రమాలతో అయితే సరిపోదు. విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలి.

కాలుష్య కారక వాహనాలపై చర్యలు తీసుకోవాలి

నగరంలో ప్రధాన రోడ్ల మీదనే కాలుష్య కారక వాహనాలు తిరుగుతున్నాయి. వాహనాల నుంచి దట్టంగా పొగ విడుదలవుతుంది. ఇలాంటి వాహనాలకు సంబంధించి రవాణా శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. పర్మిట్లు, లైసెన్సు, రిజిస్ర్టేషన్స్‌ ఉన్నాయో లేవా అన్నవి మాత్రమే చూడటం జరగుతోంది. ట్రాఫిక్‌ పోలీసులు కూడా ఇలాంటి వాహనాలను గుర్తించటం లేదు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ పెట్టుకున్నారా, లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌ వంటివి ఉన్నాయా లేదా అన్న విషయాలనే చూస్తున్నారు. ఇలా భారీ సంఖ్యలో పొగను విదిల్చే వాటిలో సింహభాగం లారీలు, ఆర్టీసీ బస్సులు ఉండగా.. కొంత మేర ద్విచక్రవాహనాలు, కార్లు కూడా ఉన్నాయి. వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది.

వెర్టికల్‌ గార్డెన్స్‌ పెంచాలి

నగరంలో నాణ్యమైనగాలిని పెంపొందించటం కోసం వెర్టికల్‌ గార్డెన్స్‌ను ఏర్పాటు చేయాలన్న ఆలోచన గతంలో చేశారు. బెంజిసర్కిల్‌ ప్రాంతంలో కొన్ని పిల్లర్లపై వెర్టికల్‌ గార్డెన్స్‌ అభివృద్ధి చేశారు. ఇది చిరు ప్రయత్నం మాత్రమే. వెర్టికల్‌ గార్డెన్స్‌ను ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సి ఉంది. హైవేల వెంట, సర్వీస రోడ్ల వెంబడి, నగరంలోని ప్రధాన రోడ్ల వెంబడి వెర్టికల్‌ గార్డెన్స్‌ను అభివృద్ధి చెయ్యటం ద్వారా నాణ్యమైన గాలి విడుదలకు అవకాశం కలుగుతుంది.

Updated Date - Feb 04 , 2026 | 01:07 AM